ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ‘నాటు నాటు’ ఫీవర్ అందుబాటులోకి వచ్చింది. మన దేశంతోపాటు హాలీవుడ్‌లోనూ ఈ పాటకు ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడిదే జాబితాలోకి దక్షిణ కొరియా మ్యూజిక్ బ్యాండ్ ‘బీటీఎస్’ సింగర్ జంగ్‌కుక్ వచ్చి చేరారు. ‘నాటు నాటు’ పాటను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. సీటులో కూర్చొనే ఆ పాటకు సరదాగా స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఆర్‌ఆర్’ తాజాగా స్పందించింది. ”జంగ్‌కుక్… ఈ పాటను నువ్వు ఇంతలా ప్రేమిస్తున్నావని తెలుసుకోవడం.. చాలా సంతోషంగా ఉంది. మీకు, బీటీఎస్ బృందం, దక్షిణ కొరియా మొత్తానికి టన్నుల కొద్దీ ప్రేమాభిమానాన్ని పంపిస్తున్నాం” అని ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీం ప్రకటించింది. మరోవైపు, ‘నాటు నాటు’ పాట ‘ఆస్కార్’కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ దీనికి అకాడమీ అవార్డు వచ్చే అవకాశం ఉందని సినీ ప్రియులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘బీటీఎస్’ విషయానికి వస్తే.. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్ ఇది. జంగ్‌కుక్, ఆర్‌ఎం, వి, జిమిన్, జిన్, జె.హోప్, సుగా.. ఇలా ఏడుగురు సభ్యులతో ఈ బ్యాండ్ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్లలో దీనికి అభిమానులు ఉన్నారు. వీరి నుంచి వచ్చిన ‘ఫేక్ లవ్’, ‘బాయ్ విత్ లవ్’, ‘బటర్’ సాంగ్స్ విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నాయి.