చైనాలో జననాల రేటు తగ్గిపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా జనాలను పెంచేందుకు చర్యలు చేపట్టారు. పెళ్లి సమయంలో వధువుకు సొమ్ము ముట్టజెప్పే సంప్రదాయాన్ని కట్టడి చేయడం మొదలుపెట్టింది. చైనాలో వరుడు తన సంపదను వధువు వద్ద ప్రదర్శించడానికి, ఆమెను పెంచినందుకు అత్తింటివారికి సొమ్ములు ముట్టజెప్పే సంప్రదాయం ఉంది. దీనిని ‘కైలీ’ అంటారు. చైనాలో జరిగే మూడొంతుల పెళ్లిళ్లలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ప్రతివరుడి కుటుంబాల్లో వార్షికాదాయానికి దాదాపు కొన్ని రెట్ల మొత్తం వధువు కుటుంబీకులకు చెల్లించాల్సిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇప్పటికే పలు మార్లు ఈ సంప్రదాయాన్ని అడ్డుకొనేందుకు చైనా యత్నించింది. జననాల రేటు పతనాన్ని అడ్డుకునేందుకు తాజాగా మరోసారి చైనా అధికారులు ఈ సంప్రదాయంపై దృష్టిపెట్టారు. ఓ వైపు దేశంలో ఆర్థిక మందగమనం కారణంగా పెళ్లిళ్ల వ్యవహారం ఖరీదుగా మారిపోయింది. ఇప్పటికే దేశంలో చాలా తక్కువ మంది పెళ్లిళ్లు చేసుకొని సంతానాన్ని చూస్తున్నారు. ఈ పరిస్థితికి ‘కైలీ’ కారణమని పరిస్థితి. జనవరిలో సెంట్రల్ హుబే ప్రావిన్స్‌లో అధికారులు కైలీ విధానం అమలు చేసేవారిపై చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు జింగ్సి నగరంలో కైలీ అడగబోమని యువతుల చేత సంతకాలు చేయించారు. ఉమెన్స్ డే సందర్భంగా జింగ్షూ ప్రావిన్స్ రాజధానిలో సామూహిక వివాహాలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు జననాల రేటు పెంచేందుకు చైనాలో కొత్త పాలసీలను తీసుకొస్తున్నారు. సంతానం కన్నవారికి సబ్సిడీలు ఇవ్వడం, పెళ్లిళ్లకు అదనపు లీవ్‌లు ఇవ్వడం ప్రారంభించింది. దీంతోపాటు పెళ్లిచేసుకోని జంటలు తమ సంతానాన్ని రిజిస్టర్ చేసుకొనే అవకాశం కూడా ఇస్తున్నారు. కానీ, ఈ నిర్ణయాలు పురుషులకు అనుకూలంగా ఉన్నాయని.. సమాజంలో స్త్రీలకు ఉన్న ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు జిన్‌పింగ్ ప్రభుత్వం యత్నిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. చైనాలో కొన్ని చోట్ల వరుడి కుటుంబీకులు సొమ్ము తీసుకొనే సంప్రదాయం కూడా ఉంది. కానీ, అధికారులు దానిపై దృష్టిపెట్టకపోవడాన్ని తప్పుపడుతున్నారు. చైనాలో వన్‌ఛైల్డ్ పాలసీని అమలు చేసిన సమయంలో కైలీ విధానం అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో పురుషుల సంఖ్య పెరిగిపోయింది.. స్త్రీల సంఖ్య తగ్గింది. దీంతో వధువు కుటుంబీకులు భారీ స్థాయిలో సొమ్మును ఆశించడం మొదలుపెట్టారు. తమ జనాభా ఇటీవలి కాలంలో తొలిసారిగా తగ్గినట్లు చైనా ప్రకటించింది. 2021 కంటే 2022 చివరినాటికి తమ దేశ జనాభా 8.50 లక్షలు తగ్గిందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) మంగళవారం. 95.6 లక్షల జననాలు, 1.04 కోట్ల మరణాలు ఉండటంతో చైనా మొత్తం జనాభా 141.18 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో పురుషులు 72.2 కోట్లు ఉండగా, మహిళలు 68.97 కోట్ల మంది ఉన్నారు. ఈ లెక్క చైనా ప్రధాన భూభాగానికే పరిమితం. హాంకాంగ్, మకావ్ భూభాగాలతోపాటు స్థానికంగా ఉంటున్న విదేశీయులను తీసుకోలేదు.