చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దాదాపు 3 వేల మంది సభ్యులు కలిగిన చైనా పార్లమెంట్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ జిన్‌పింగ్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకుంది. అధ్యక్ష పోటీలో మరొకరు లేకపోవడంతో జిన్‌పింగ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు స్థానిక మీడియా ప్రసారం. అలాగే, చైనా సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్‌గానూ జిన్‌పింగ్ మూడోసారి ఎన్నికయ్యారు. ముచ్చటగా మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన జిన్‌పింగ్.. మరో ఐదేళ్ల పాటు ఆయనకే అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ చైనా పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చైనా పార్లమెంటు ఆయన ఎన్నికకు ఆమోద ముద్ర వేసింది. ఈ ఎన్నికతో చైనాకు ఇకపై జీవిత కాల అధ్యక్షుడిగా కొనసాగనున్నారు జిన్‌పింగ్. అక్టోబర్‌లో నిర్వహించిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాల్లో పార్టీ రాజ్యాంగ సవరణలు జరిగాయి. ఇది అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను మూడోసారి అదే పదవిలో కొనసాగేలా చేస్తుంది. జిన్‌పింగ్‌కు మరి కొన్ని అధికారాలు కట్టబెట్టి ఆయననే మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగేలా తీర్మానం చేస్తారని ముందు నుంచి వినిపిస్తూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే సెంట్రల్ కమిటీలోని 370 మంది సీనియర్ లీడర్లు కొన్ని కీలక తీర్మానాలను ప్రవేశపెట్టారు. దీనితో పాటు పార్టీ రాజ్యాంగంలోనూ సవరణలు చేశారు. జిన్‌పింగ్‌కి సర్వాధికారాలు కట్టబెట్టేలా సవరణలు అందించారు. కమ్యూనిస్ట్ పార్టీకి గవర్నింగ్ బాడీగా ఉండే సెంట్రల్ కమిటీ…దేశవ్యాప్తంగా ఎలాంటి విధానాలు అమలు చేయాలో స్పష్టంగా వివరిస్తుంది. అంతే కాదు. వచ్చే ఐదేళ్లలో ఎలాంటి మార్పులు చేయాలన్నదీ సూచించింది. ఇక, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఎలాంటి శక్తిమంతమైన నేతగా పేరుపొందారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కనుసైగలతో డ్రాగన్ దేశాన్ని నడిపించిన కమ్యూనిస్ట్ నేతల్లో ఆయన అగ్రస్థానంలో ఉంటారు. ఇప్పుడు మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి..పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నేతగా జిన్‌పింగ్ అరుదైన రికార్డు సాధించారు.