ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదహారో సీజన్ ప్రారంభానికి కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రికెట్ అభిమానులను అలరించడానికి ఆసీస్ తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ సిద్ధమైపోయాడు. అదేంటి, గత ఐపీఎల్ మినీ వేలంలో స్మిత్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు కదా..? మరెలా అతడు ఐపీఎల్‌లో కనిపిస్తాడనేదేగా మీ అనుమానం. అయితే, ఈసారి స్టీవ్ స్మిత్ ప్లేయర్‌గా మైదానంలో దిగడం లేదు. సరికొత్త పాత్రను పోషించేందుకు సిద్దమయ్యాడు. అదే కామెంటేటర్.. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ కూడా దీనిని ధ్రువీకరించింది. రెండు రోజుల కిందట తాను ఐపీఎల్‌కు వస్తానని స్మిత్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఏదైనా ఫ్రాంచైజీ రిప్లేస్‌మెంట్ చేసుకుంటుందేమోనని అంతా భావించారు. తీరా ఇప్పుడు కామెంట్రీ ప్యానెల్‌లోకి రావడం విశేషం. ”మెగా లీగ్‌లో స్టీవ్ స్మిత్ భాగం కానున్నాడు. వ్యాఖ్యాతల బృందంతో చేరతాడు. స్టార్ స్పోర్ట్స్‌తో కామెంట్రీ ప్రారంభించడం ఆనందంగా ఉంది” అని బ్రాడ్‌కాస్టర్ ఓ ప్రకటన విడుదల చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీపై నిషేధం పడిన సమయంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌ను కెప్టెన్‌గా ఫైనల్‌కు చేర్చిన అనుభవం స్మిత్ సొంతం. అయితే, గత మినీ వేలంలో కనీస ధర రూ. 2 కోట్లతో వచ్చినప్పటికీ.. అతడిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. తాజాగా భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆసీస్‌ను విజేతగా నిలిపాడు. ఒక ఆటలోనూ తన జట్టును గెలిపించాడు.