గుంటూరు: వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ఐటీ సోదాలు నిర్వహించడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ముస్తఫా సోదరుడు కనుమ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కనుమ అంజుమన్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నారు. ఎమ్మెల్యే ముస్తఫా లావాదేవీలను కనుమ చూసుకుంటున్నారు. అధికార పార్టీ నేత ఇంట్లో ఐటీ సోదాలతో తీవ్ర కలకలం రేగుతోంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో ముస్తఫా వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఈ సారి ఎన్నికల్లో మాత్రం తాను నిలబడబోనని.. తన కూతురు పోటీ చేస్తుందని ఇప్పటికే ముస్తఫా ప్రకటించారు. గతంలో ముఖ్యమంత్రి జగన్ తమ నియోజకవర్గానికి వచ్చిన నేపథ్యంలో ఆయనకు ముస్తఫా తన కుమార్తెను పరిచయం చేశారు. కాగా.. రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయం నుంచి ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. తండ్రితో పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు అవుతున్నారు.