అమరావతి: రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలు అర్థం చేసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం రామ్ మనోహర్ లోహియా జయంతి సందర్భంగా పవన్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో కుల సమస్య… కులాలపై శాస్త్రీయ అవగాహనతో.. విశాల దృక్పథంతో మాట్లాడిన మహనీయుడు రామ్ మనోహర్ లోహియా అని కొనియాడారు. ఆయన ప్రతిపాదించిన సోషలిస్ట్ సిద్ధాంతాలను అర్థం చేసుకుంటే అన్ని వర్గాల ప్రజల సామరస్య భావనతో ముందుకు వెళ్తారు. జనసేన పార్టీ సిద్ధాంతాలపైనా… పోరాట పంథాపైనా రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలు, ఆలోచన ప్రభావం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. ఎలుగెత్తు… ఎదిరించు.. ఎన్నుకో… అనే జనసేన పోరాట విధానానికి రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలే స్ఫూర్తి అని, కులాలను కలిపే ఆలోచనా విధానం అనేది జనసేన సిద్ధాంతాల్లో ఒకటని అన్నారు. లోహియా చెప్పిన విధంగా కులాల మధ్య అంతరాలు తగ్గించడం వర్తమాన సమాజానికి ఎంతో శ్రేయస్కరమన్నారు. ఆంధ్రప్రదేశ్ కుల వ్యవస్థపై లోహియాకు అధికారం ఉందని, ఆయన ఇక్కడి కుల విధానాల గురించి చెబుతూ రాజ్యాధికారానికి దూరంగా ఉన్న కులాలు ఏ విధంగా ముందుకు వెళ్లాలో ‘ది క్యాస్ట్ ఇన్ ఇండియా’ పుస్తకంలో వివరించారని పవన్ అన్నారు. కేవలం కుల వ్యవస్థపైనే కాదు మహిళా సాధికారతతో భారతీయ సమాజ వికాసం గురించి కూడా విపులంగా చెప్పారు. లోహియా సిద్ధాంతాలు ప్రతిపాదించడమే కాదు.. వాటిని తన ప్రజా జీవితంలో ఆచరించి చూపించారు. ముఖ్యంగా యువత లోహియా సిద్ధాంతాలు అర్థం చేసుకుంటే కులాల కట్టడం నుంచి బయటపడవచ్చునని పవన్ కల్యాణ్ నిర్ణయించుకుంటారు.