ఎన్టీఆర్ జిల్లా
పెగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయం దుకాణ సముదాయంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆలయ ప్రాంగణంలోని బొమ్మల దుకాణంలో విద్యుత్తు షార్ట్సర్ట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వచ్చే నెల అయిదో తేదీ నుంచి తిరునాళ్ల జరగనున్న నేపథ్యంలో వ్యాపారులు పెద్ద ఎత్తున సామగ్రి కొనుగోలు చేసి నిల్వ చేశారు.
ప్రస్తుతం జరిగిన ప్రమాదంలో ఒక్కో దుకాణంలో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత వ్యాపారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే జగ్గయ్యపేట అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. మొత్తం 19 దుకాణాల్లో సుమారుగా రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సర్పంచి వేల్పుల పద్మకుమారి, దేవస్థానం అధికారులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున వచ్చి మంటలను ఆర్పేందుకు సహకరించారు.