,
||తిరుమల తిరుపతి దేవస్థానం||
ఈవార్తలు, ఆధ్యాత్మికం : ఏడుకొండల వాడిని దర్శించుకొని తరలించాలన్నది ప్రతి హిందూ భక్తుడి ఆరాటం. శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూడని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఆ ఏడు కొండలను దాటుకొంటూ, స్వామి వారిని దర్శనం చేసుకొంటే మనసుకు ప్రశాంతత దక్కుతుందన్న విశ్వాసం. అయితే, స్వామి వారి దర్శనానికి ఆన్‌లైన్ టికెట్ తప్పనిసరి. ముఖ్యంగా శీఘ్ర దర్శనం, ఆర్జిత సేవలు, వృద్ధులు, దివ్యాంగులు దర్శనం చేసుకోవాలంటే కచ్చితంగా టికెట్ బుక్ చేసుకోవాలి. ప్రస్తుతం నెల చివరిలో సందర్భాన్ని బట్టి టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నారు. సరైన తేదీ తెలియక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు టీటీడీ ముందుకొచ్చింది. ప్రతి నెల ఆయా తేదీల్లోనే ఆయా సౌకర్యాల టికెట్లు ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల చేసింది.
టికెట్ విడుదల షెడ్యూల్:
ప్రతి నెల 18 నుంచి 20 తేదీల్లో – సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాద పద్మారాధన ఆర్జిత సేవ లక్కీ డిప్ కోసం నమోదు
20 నుంచి 22వ తేదీ వరకు – డిప్‌లో టికెట్లు పొందిన వారు డబ్బు చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాలి.
ప్రతి నెల 22వ తేదీన – కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవలతోపాటు వర్చువల్ సేవాటికెట్ల విడుదల
ప్రతి నెల 23వ తేదీన – శ్రీవాణి, అంగ ప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు విడుదల
ప్రతి నెల 24వ తేదీన – రూ.300 దర్శన టిక్కెట్లు
ప్రతి నెల 25వ తేదీన – తిరుపతిలో గదుల కోట విడుదల
ప్రతి నెల 26వ తేదీన – తిరుమలలో గదుల కోట విడుదల