||ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో వచ్చిన పలు వార్తల స్క్రీన్ షాట్లు. ఫోటో మూలం: ఆంధ్రజ్యోతి పేపర్||
ఈవార్తలు, ఈముచ్చట:తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలంటే రంజుగానే ఉంటాయి. అందులోనూ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తెలంగాణలో ఎన్నికల వేడి కాస్త ఎక్కువైంది. ఏపీలో జగన్-చంద్రబాబు-పవన్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నా, తెలంగాణలో ఎన్నికలు ఆసక్తి పెంచుతున్నాయి. ఎందుకంటే.. రెండు జాతీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉండగా, జాతీయ పార్టీగా అవతరిస్తున్నామని చెబుతున్న మరో పార్టీ అధికారం చెలాయిస్తోంది. జాతీయ పార్టీల రాష్ట్ర అధినేతలు అధికార బీఆర్‌ఎస్‌పై దూకుడుగానే పోరాడుతున్నారు. మొన్నటిదాకా బీజేపీ కేసీఆర్‌పై ఒంటి కాలిపై లేచినా, ఇప్పుడు రెండు కాళ్లు కింద పెట్టేసిందన్న చర్చ నడుస్తోంది. ఈ రాజకీయ చర్చలు ఎలా ఉన్నా.. రాజకీయాలకు వారధిగా నిలిచే జర్నలిజం ఇప్పుడు కొత్తగా కన్పిస్తోంది. పత్రికలు, వార్తాచానెళ్లు అన్నీ అధికార పార్టీకే కొమ్ముకాస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి ఈ తరుణంలో (ఎన్నికలు సమీపిస్తున్న వేళ) అసలైన జర్నలిజం బయటికి వస్తున్నట్లు కనిపిస్తోంది. పలు పత్రికలు ఎప్పటి నుంచో తమ రాతలను అమ్మేసుకున్నాయి. కొన్ని పత్రికలు తటస్థంగా ఉన్నాయి. కానీ, కొన్ని పత్రికలు తమ ధాటి తీవ్రతను తెలుపుతున్నాయి. అందులో ప్రధానంగా చెప్పాల్సింది ఆంధ్రజ్యోతినే. టైం వచ్చిన ప్రతీసారి ఆంధ్రజ్యోతి పవర్ అంటే ఏంటో చెప్తుందీ పత్రిక.
అధికారంలో ఉన్న వాళ్లకు సపోర్ట్ చేస్తే ఎంత ఎత్తుకుంటుందో, అదే అధికార పార్టీని చీల్చి చెండాడాలంటే అంతే గట్టిగా నేలకు కొడుతుంది. అందుకే ఇది ఆర్కే మార్క్ పత్రిక అయ్యింది. గుర్తు లాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నా, ప్రభుత్వం నుంచి ప్రకటనలు లేకపోయినా తన రేంజ్ చూపిస్తూ వస్తోంది. ఈ పత్రిక గురించి ఇంత గొప్పగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే.. ఈ మధ్య పత్రికను చూస్తే అవగతం అవుతుంది. తెలంగాణలో బీజేపీకి మొట్టికాయలు వేయాలన్నా, తెలంగాణలో అధికార, విపక్షాలను దారిలో పెట్టాలన్నా, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు తప్పును, జగన్ తీరును ఎత్తి చూపాలన్నా ఏ మాత్రం వెనుకాడదు. అంతా ఈ పత్రికను ఎల్లో పత్రిక అని అంటుంటారు.. అందులో వాస్తవం గురించి పక్కన బెడితే, చంద్రబాబు పనితీరును విమర్శించాలన్నా ఏ మాత్రం సంకోచించదు. అందుకు ఈ మధ్య వచ్చిన ఆర్కే కొత్తపలుకే నిదర్శనం.
ఇప్పుడు ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. తెలంగాణలో ఆంధ్రజ్యోతి అసలు సిసలైన జర్నలిజం గురించే. ఈ పత్రిక ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది అని అంతా అనుకుంటారు. కానీ, పాలనలో కేసీఆర్ ఇంకెంత మంచి చేయాలో నేర్పుతోంది. ఎక్కడ లొసుగులు ఉన్నాయి? ఎక్కడ తప్పుడు జరుగుతోంది? అన్నవాటిని గుర్తించేందుకు సహాయం చేస్తోంది. ఈ మాట తెలంగాణ సీఎం కేసీఆర్‌ను అడిగినా ఇదే చెప్తారు. ఇది తప్పూ అని ఎంత గట్టిగా చెప్తుందో, సరిచేసుకోవాలని అంతే ధాటిగా సూచిస్తుంది. అయితే, సరిగ్గా ఎన్నికల సమయంలో తెలంగాణ పార్టీపై ఆంధ్రజ్యోతి సమరశంఖం పూరించినట్లే. దశాబ్ది వేడుకలు జరుగుతున్న తీరును ప్రజల ముందు ఉంచుతోంది. ఈ పదేళ్ల కాలంలో చేసిన తప్పులను ఎత్తి చూపుతోంది. దశాబ్ది దారెటు? అన్న సిరీస్ ఇతర పత్రికల జర్నలిస్టులు కూడా సంతృప్తి పొందేలా చేస్తోంది. ఈ శైలి నచ్చి, ఈ వ్యాసం రాయటానికి పూనుకున్నా.
– జర్నలిస్టు (ఆంధ్రజ్యోతి ఉద్యోగిని మాత్రం కాదు!)