ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రాజకీయ వారసులు ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారా ? అన్న చర్చ జోరుగా సాగుతోంది. యువతకు అవకాశాలు, విద్యాధికులకు పార్టీ తరపున అవకాశం ఇచ్చినట్లు ఉండాలన్న ఉద్దేశంతో యువతకు అవకాశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలలో వీరి గెలుపుపై ఆసక్తి నెలకొంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణా రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, బందరు ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడు కృష్ణమూర్తి, రామచంద్రాపురం ఎమ్మెల్యే పిల్లి సుభాష్ కుమారుడు సూర్యప్రకాష్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె ఫాతిమాకు వైసీపీకి అవకాశం కల్పించారు. గుంటూరు, బందరు మినహాయిస్తే చంద్రగిరి, తిరుపతి, రామచంద్రాపురంలలో పరిస్థితులు ఆశాజనకంగా లేవని తెలుస్తున్నది.
ఇక తెలుగుదేశం పార్టీ నుండి కోవూరు నుండి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డికి, ప్రత్తిపాడు నుండి ఇటీవల మరణించిన వరపుల రాజా సతీమణి సత్యప్రభకు, వెంకటగిరి నుండి మహిళాకోటలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామక్రిష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు, శ్రీకాళహస్తి నుండి బొజ్జల గోపాలరెడ్డి క్రిష్ణారెడ్డి కుమారుడుపల్లె సుధీర్ రెడ్డికి, కమలాపురం నుండి నరసింహ రఘునాథరెడ్డి కోడలు సింధూరరెడ్డికి అవకాశం ఇచ్చారు. వారసులకు టికెట్ వచ్చిందని నాయకులు సంతోషంగా ప్రచారంలో దూసుకుపోతున్నా ప్రజలు వీరిని ఎంతవరకు ఆదరిస్తారు ? పార్టీల ప్రయోగాలు ఎంత వరకు ఫలిస్తాయి ? అన్నది వేచిచూడాలి