ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ అనకాపల్లి జిల్లా చింతమనేనిలో మేమంతా సిద్ధం సభకు ప్రతిపాదనపాలెం. నేడు చింతపాలెంలో జనసముద్రం కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. పెత్తందార్లపై యుద్ధం ప్రకటించడానికి సైన్యంలా ఉందని అభివర్ణించారు.
చేసిన మంచి ఏది లేక మోసాలు, కుట్రలు, అబద్ధాలు, పొత్తులతో వస్తున్న వారిని ఈ ఎన్నికల్లో ఎదుర్కోబోతున్నాం… మీరంతా సిద్ధమేనా? అని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి, ప్రతి వర్గానికి మంచి చేసి, మంచిని చూపించి మనం ఎన్నికలకు వస్తున్నాం అని వివరించారు. చేసిన మంచి ఏది లేక… మేం వస్తే ఇది చేస్తాం, ఇకమీదట ఇది చేస్తాం అంటూ మళ్లీ భ్రమలు కల్పిస్తున్న ఇలాంటి అన్యాయస్తులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? అని అన్నారు.
“జగన్ ను ఓడించాలని వారు… పేదలను గెలిపించాలి, ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ పోరాటం 2024 ఎన్నికల చరిత్రలో నిలిచిపోతుంది. అందుకు మీరంతా సిద్ధమేనా? మన ఈ సిద్ధం సభలను చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు, బస్సులు పరిగెడుతున్నాయి. ఆ ఉక్రోషం, కడుపుమంట భగ్గుమని చంద్రబాబు నాపై రాళ్లు వేయబోతున్నాడు, నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు.
ఇదీ చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మల అజెండా. దీనికోసం వాళ్లకు అధికారం కావాలట… జగన్ ను కొట్టడానికి, జగన్ కు హాని చేయడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి వీళ్లకు అధికారం కావాలట.
ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే… జగన్ ఒక బచ్చా అని కూడా అంటున్నాడు. అయితే, కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు, పూతన, కాళిందిని చూస్తే బాబు గుర్తుకు వస్తున్నారు. రాముడ్ని బచ్చా అనుకున్న సుబాహుడు, మారీచుడు ఇప్పుడు రామోజీ వేషంలోనూ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వేషంలోనూ కనిపిస్తున్నారు. హనుమంతుడ్ని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్లను చూస్తే గుర్తుకొస్తున్నాడు.
చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా అటువైపున నిల్చున్నవారు బచ్చాల్లాగానే కనిపిస్తారు. అయ్యా చంద్రబాబూ… నువ్వు బచ్చా అంటున్న నేను అందరికీ మంచి చేసి ధైర్యంగా ప్రజల్లోకి వస్తున్నా. మరి నువ్వు 14 ఏళ్లు సీఎంగా చేశావు కదా… పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే బచ్చాను చూసి ఎందుకు భయపడుతున్నావు? పొత్తుల కోసం ఎందుకు ఎగబడుతున్నావు? ఈ 75 ఏళ్ల వయసులో నువ్వు పదిమందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తోంది?
ఇవాళ ఇంటింటికీ మంచి చేసిన మీ బిడ్డ చుట్టూ ఎంతమంది బాణాలు పట్టుకుని ఉన్నారో గమనించండి. మీ బిడ్డ ఒక్కడూ ఒకవైపున… అటువైపున చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్… వీళ్లందరూ సరిపోరన్నట్టుగా కుట్రలు, మోసాలు, అబద్ధాలు… వీరందరూ కలిసి మీ బిడ్డ ఒక్కడి మీద బాణాలు, రాళ్లు, ఆయుధాలు పట్టుకుని చుట్టూ నిలబడి ఉన్నారు. వీళ్లందరి మధ్య మీకు మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే నిలబడి ఉన్నాడు.
మరి మీ బిడ్డ జగన్ కు తోడెవరు…? జగన్ కు తోడు ఆ దేవుడు, కోట్లమంది పేదలు, ఇంటింట్లో ఉన్న అక్కచెల్లెమ్మలు అని గర్వంగా చెప్పుకుంటున్నా. నేను సింగిల్ గానే వస్తున్నా నీకెందుకయ్యా బాబూ ఇంత భయం? సింగిల్ గా వస్తున్న ఒక్కడ్ని ఎదుర్కోవడానికి ఇన్ని నక్కలు ఏకమవుతున్నాయి.
అయ్యా బాబూ… నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తుగా ఓడిపోయి కేవలం 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నిన్ను ఏమనాలి? నేను బచ్చా అయితే… ఐదేళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వొక్కడివే రావడానికి నీకు ధైర్యం చాలడంలేదు… అరడజను మందిని వెనకేసుకుని వస్తున్న నిన్ను ఏమనాలి?
నేను బచ్చా అయితే… ఈ 58 నెలల గ్రామాలకు, రైతులకు, పేదలకు, అక్కచెల్లెమ్మలకు, పిల్లలకు, అవ్వాతాతలకు, సామాజిక వర్గాలకు నేను చేసిన మంచి, ఇంటింటికీ చేసిన అభివృద్ధి… నువ్వు 14 ఏళ్లు సీఎంగా ఉన్నా ఎందుకు చేయలేకపోయావు బాబూ? నిన్ను ఏమనాలి?” అంటూ సీఎం జగన్ వాడీవేడిగా ప్రసంగించారు.
వైఎస్ జగన్, చంద్రబాబు, మేమంత సిద్ధం, చింతపాలెం, అనకాపల్లి జిల్లా, YSRCP, TDP,-JanaSena -BJP Alliance