తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు భద్రతను మరింత పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు భద్రతను కల్పించడం సర్వత్ర ఆసక్తి చూపుతోంది. చంద్రబాబుకు అకస్మాత్తుగా భద్రతను పెంచడం పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనూ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబుపై దాడులకు ప్రయత్నించారు. ఒక సభలో విసిరిన రాయి త్రుటిలో చంద్రబాబుకు తప్పింది. ఎన్నికల ఫలితాలకు మరికొద్ది రోజుల సమయం ఉందనగా కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచడం ఆసక్తిని రేపుతోంది.. కేంద్రం నుంచి వచ్చిన భద్రతా అధికారులు రెండు రోజుల నుంచి చంద్రబాబు నివాసంతోపాటు ఆయన సంచరించే పలు ప్రదేశాలను పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద, కరకట్ట వద్ద, చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద, గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుండి కరకట్ట మార్గాలు తదితర ప్రాంతాలను ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక భద్రతా అధికారులు పరిశీలించారు. చంద్రబాబు భద్రతకు భంగం వాటిల్లకుండా భద్రత పెంచాల్సిన అవసరాన్ని గుర్తించిన అధికారులు ఈ మేరకు కేంద్రానికి అందించారు. ఒప్పందం వెంటనే స్పందించిన కేంద్రం 24 మంది ఎస్పీజీ బ్లాక్ క్యాట్ కామండోలను చంద్రబాబు రక్షణకు కేటాయించారు. 12 మంది చొప్పున రెండు గ్రూపులుగా విడిపోయి చంద్రబాబుకు రక్షణ కల్పించనున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల అనంతరం జరుగుతున్న గొడవల కారణంగానే చంద్రబాబుకు భద్రత పెంచినట్లు చెబుతున్నారు. మరోవైపు బిజెపికి సంబంధించిన ముఖ్య నేతలు యోగి ఆదిత్యనాథ్ వంటి వారికి రక్షణ తగ్గిస్తుండగా.. చంద్రబాబుకు మరింత రక్షణ కల్పించడం పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.