అమెరికాలో విజయవాడ మహిళకు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, ప్రేమలత దంపతుల కుమార్తె జయ బాడిగ కాలిఫోర్నియాలోని సాక్రమెంటో కౌంటి సుపీరియల్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. 2022 నుంచి ఇదే కోర్టులో జయ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. జయ తండ్రి బాడిగ రామకృష్ణ 2004 – 2009 మధ్య కాలంలో మచిలీపట్నం ఎంపీగా పనిచేశారు. రామకృష్ణ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. జయ మూడో కుమార్తె. ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం అంతా హైదరాబాదులోనే సాగింది. ఉస్మానియా యూనివర్సిటీలో సైకాలజీ, పొలిటికల్ సైన్స్ లో బిఏ పూర్తి చేసిన అనంతరం ఆమె అమెరికా వెళ్లి బోస్టన్ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. శాంటా క్లారా విశ్వవిద్యాలయం నుంచి లా పట్టా పొందారు. ఆ తరువాత 2009లో కాలిఫోర్నియా స్టేట్ బార్ ఎగ్జామ్ ను క్లియర్ చేశారు. పదివేలకు పైగా న్యాయవాద వృత్తిలో ప్రైవేటు ప్రాక్టీస్‌ను కొనసాగించిన ఆమె.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రైన్ అడ్వకేసిలో ఫ్యాకల్టీ మెంబర్‌గా ఉన్నారు. నెక్ జార్జ్ స్కూల్ ఆఫ్ లా అధ్యాపకురాలిగా పని చేశారు. జయతోపాటు మరో భారత సంతతి న్యాయమూర్తి రాజు సింగ్ భదేశా సహా 18 మందిని న్యాయమూర్తులుగా నియమిస్తూ గవర్నర్ న్యూ సోమ్ ప్రకటన చేశారు. ఈమె నియామకం పట్ల ప్రవాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలుగుజాతి గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన జయను పలువురు కొనియాడుతున్నారు.