విశ్వవిఖ్యాత నవరస, నట సార్వభౌముడిగా, తెలుగు జాతి ఆత్మగౌరవ పరిరక్షణ ధ్యేయంగా పార్టీని పెట్టిన నాయకుడిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సినీ, రాజకీయ రంగ దిగ్గజం ఎన్టీఆర్. తెలుగు వారి మదిలో అన్నగా నిలిచిన నందమూరి తారక రామారావు ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శం. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఎన్టీఆర్.. రాజకీయ రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక పేజీని ఏర్పాటు చేశారు. సినీ రంగం నుంచి రాజకీయ రంగం వైపు ఆయన సాగించిన ప్రయాణం, ఎన్టీ రామారావు సాధించిన విజయాలు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. నేడు అన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
నందమూరి తారక రామారావు వెండితెరపై అందాల రాముడుగా, కొంటె కృష్ణుడిగా, ఏడుకొండల వెంకటేశుడిగా.. ఇలా ఏ పాత్ర అయినా ఆయన చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం వస్తుందనేలా అభిమానుల మనసును చూరగొన్న అందాల నటుడు ఎన్టీఆర్. కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ అతి తక్కువ సమయంలోనే సంచలనం సృష్టించారు ఎన్టీఆర్. 13 ఏళ్ల రాజకీయ మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్టీఆర్.. తెలుగుజాతి ఆత్మగౌరవమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకుని రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరుగా నిలిచారు అన్న నందమూరి తారక రామారావు. సినిమాల్లో పౌరాణిక పాత్రలే కాకుండా సాంఘిక, జానపద, చారిత్రక సినిమాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అందమైన నటుడు ఎన్టీఆర్. తెలుగు సినీ చరిత్రలో సాటిలేని కథా నాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ తన నటన జీవితంలో అనేక చిత్రాలలో నటించి తనకంటూ అభిమాన గణాన్ని సృష్టించారు. ఎన్టీఆర్ కేవలం నటుడుగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, రాజకీయ వేత్తగా, ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యం కాని అనేక రికార్డులను తన పేరుతో లిఖించుకున్నారు. తెలుగు ప్రజలందరి చేత అన్నా అనిపించుకున్న గొప్ప నటుడు ఎన్టీఆర్.
నాటకాలతో ప్రారంభమై రాజకీయాలతో ముగింపు..
ఎన్టీఆర్ సినిమాల్లోకి రావడానికి ముందు నాటకాలు వేసేవారు. నాటకాలతో ఇప్పటికే మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు ఎన్టీఆర్. అతనిలోని నటుడిని గుర్తించిన ప్రముఖ దర్శక, నిర్మాత బి.ఎ.సుబ్బారావు పల్లెటూరి పిల్ల చిత్రంలో ఎన్టీఆర్ కు సినీ అందించారు. ఆ తరువాత నుంచి వెనిదిరగకుండా అంచలంచలుగా ఎదుగుతూ తనకంటూ ఒక ప్రత్యేక సినీ రంగంలో సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ ఈ సినిమాను ప్రారంభించినా.. ఆ సినిమా ఆలస్యం కావడంతో ఎల్వీ ప్రసాద్ డైరెక్షన్ లో మనదేశం సినిమాలో అవకాశం రావడంతో అందులో నటించారు. 1949లో వచ్చిన మన దేశం చిత్రంలో ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్ర పోషించారు ఎన్టీఆర్. ఆ తరువాత 1950లో పల్లెటూరు పిల్ల చిత్రం విడుదలైంది. అదే ఏడాది విజయ ప్రొడక్షన్ సంస్థ ఎన్టీఆర్, జానకి హీరో హీరోయిన్లుగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో షావుకారు సినిమా నిర్మించారు. ఎన్టీఆర్ తొలి 20 ఏళ్లలో 200 సినిమాలు చేశారు. ఏడాదికి సగటున 10 చిత్రాలు ఎన్టీఆర్ విడుదలయ్యేవి. విజయ సంస్థతో కుదిరిన ఒప్పందంతో ఎన్టీఆర్ ఆ బ్యానర్ కు ఆస్థాన నటుడయ్యారు. 1951లో కేవీరెడ్డి డైరెక్షన్‌లో నిర్మించిన పాతాళ భైరవి నటుడిగా ఎన్టీఆర్‌కు తిరుగులేని ఖ్యాతిని అందించారు. 1956లో విడుదలైన మాయాబజార్ సినిమాలో తొలిసారిగా శ్రీకృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ మెప్పించారు. పౌరాణిక పాత్రలకు ఈ చిత్రంతోనే ఎన్టీఆర్ నాంది పలికినట్టు అయింది.
వెండి తెరపై కృష్ణుడంటే రామారావు అనేంతగా బలమైన ముద్రను ఎన్టీఆర్ వేయగలిగారు. ఆ తరువాత ఎన్టీఆర్ కృష్ణుడుగా 18 చిత్రాల్లో కనిపించారు. అంతర్నాటకాల్లో కలిపి మొత్తంగా 30కిపైగా సినిమాల్లో శ్రీకృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ కనిపించి అభిమానులను మెప్పించారు. రామారావు తొలిసారిగా రాముని గెటప్‌లో చరణదాసి అనే సాంఘిక చిత్రంలో కనిపించారు. రామారావు శ్రీరాముని గెటప్‌లో పూర్తి స్థాయిలో కనిపించింది మాత్రం తెలుగు సినిమాలో కాదు. తమిళంలో తీసిన సంపూర్ణ రామాయణంలో పూర్తి స్థాయి రాముడు గెటప్ లో ఎన్టీఆర్ కనిపించారు. ఆ తరువాత 1963లో విడుదలైన లవకుశ సినిమా రాముడిగా ఎన్టీఆర్‌కు ఎనలేని కీర్తి ప్రతిష్టలను సంపాదించింది. ఆ తరువాత రామాంజనేయ యుద్ధం, శ్రీరామ పట్టాభిషేకం వంటి సినిమాల్లో మర్యాద పురుషోత్తముడి పాత్రలో మెప్పించడం ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైంది. 1959లో ఏవీఎం వారు నిర్మించిన భూకైలాస్ చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు ఎన్టీఆర్ జీవితం పోశారు. ఆ తరువాత తన సొంత బ్యానర్ ఎన్ఏటిపై నిర్మించిన సీతారామ కళ్యాణం తొలిసారి దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ అందులో రావణుడిగా నటించి మెప్పించారు. ఎన్టీఆర్ తర్వాత వెంకటేశ్వర స్వామి మహత్యం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం సినిమాల్లో వెంకటేశ్వరుడిగా నటించి అభిమానులను మెప్పించారు. ఎన్టీఆర్ నటించిన చిత్రాలలో దాదాపు 97% చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించడం విశేషం. తెలుగులో ఇలాంటి రికార్డు ఎవరికి లేదు. పౌరాణిక చిత్రాలే కాదు జానపద సినిమా హీరోగా ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ సంపాదించుకున్నారు.
1977లో కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన అడవి రాముడుతో ఎన్టీఆర్ క్రేజ్ ఎన్నో రెట్లు పెరిగింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ హీరోగా సెకండ్ మొదలుపెట్టారు. వరుస పెట్టి మాస్ సినిమాలతో దడదడలాడించేశారు ఎన్టీఆర్. అడవి రాముడు విడుదలకు ముందు అదే ఏడాది విడుదలైన దానవీరశూరకర్ణను ఎవరు మరిచిపోలేరు. అందులో ఆయన పోషించిన శ్రీకృష్ణ, కర్ణ, దుర్యోధన పాత్రలు అనితర సాధ్యమనే చెప్పాలి. అంతేకాదు దాదాపు నాలుగు గంటలు నిడువు కలిగిన ఈ సినిమా ఎలాంటి కోతలు పెట్టకుండా విడుదల చేసి అఖండ విజయం సాధించడం ద్వారా ఎన్టీఆర్ మరో చరిత్ర సృష్టించినట్లు అయింది. 1977లో ఒకే ఏడాదిలో దానవీరశూరకర్ణ, అడవి రాముడు, యమగోల వంటి మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఇండస్ట్రీ ఇట్స్ అందుకున్నారు ఎన్టీఆర్. ఒకే క్యాలెండర్ ఇయర్ లో మూడు ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న ఏకైక హీరో ఎన్టీఆర్ కావడం విశేషం. అదే ఏడాది చాణిక్య చంద్రగుప్త, మా ఇద్దరి కథ విడుదలై సక్సెస్ సాధించడం విశేషం. 1979లో ఎన్టీఆర్ శ్రీమద్విరాట్ విరాట్ పర్వంలో ఐదు పాత్రలు పోషించి మెప్పించారు. ఈ సినిమాలో శ్రీకృష్ణ, దుర్యోధన, కీచక, అర్జున, గృహన్నల పాత్రలను అవలీలగా పోషించి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు అన్న ఎన్టీఆర్.
అంతకుముందు జగదేకవీరుని కథలో శివశంకరి పాటలో ఐదు పాత్రల్లో తొలిసారిగా కనిపించి ఎన్టీఆర్ మెప్పించారు. ఎన్టీఆర్ స్టార్ గా వెలుగుతున్న దశలోనే తాత, తండ్రి, మనవడు పాత్రల్లో కులగౌరవం అనే చిత్రాల్లో త్రిపాత్రాభినయం చేశారు. ద్విపాత్రాభినయం కలిగిన చిత్రాలను లెక్కలేనని పోషించారు. నా దేశం చిత్రం ఎన్టీఆర్ నటించిన ఆఖరి మాస్ చిత్రంగా నిలిచిపోయింది. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని చేసి రాజకీయ రంగంలోనూ చరిత్ర సృష్టించారు అన్న నందమూరి తారక రామారావు. రాజకీయాల్లో ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక్, మేజర్ చంద్రకాంత్, శ్రీనాథ కవి సార్వభౌమ లాంటి చారిత్రక, పౌరాణిక చిత్రాలు తీసి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ఎన్టీఆర్ తాను కన్నుమూసే వరకు చేసిన ఎక్కువ చిత్రాలు హీరో టైటిల్ పేరు మీదనే చేశారు. హీరోగా ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రం మేజర్ చంద్రకాంత్. అంతకుముందు ఈయన యాక్ట్ చేసిన శ్రీనాథ కవి సార్వభౌముడు సినిమా ఆలస్యంగా విడుదలైంది. ఈ రకంగా నటించిన ఆఖరి చిత్రం మేజర్ చంద్రకాంత్ అయినా.. నట థియేటర్లలో విడుదలైన చివరి చిత్రం శ్రీనాథ కవి సార్వభౌముడిగా మిగిలిపోయింది. ఎన్టీఆర్ తన 44 ఏళ్ల సినీ జీవితంలో 13 చారిత్రకాలు, 55 జానపదాలు, 156 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు చేసి తెలుగు తెరపై చెరగని ముద్రవేశారు. హిందీలో నయా ఆద్మీ, చండీరాణి అనే రెండు సినిమాలతోపాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించారు ఎన్టీఆర్.
తెలుగు ప్రజల గుండెచప్పుడు మిగిలిపోయిన ఎన్టీఆర్
సినీ రంగంలో దేవుడు పాత్రల్లో నటించడం ద్వారా.. తెలుగు ప్రజల గుండెల్లో దేవుడుగా గూడు కట్టుకున్న ఎన్టీఆర్.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. సినీ రంగంలో విశ్వవిఖ్యాత నవరస నట సార్వభౌముడిగా గుర్తింపు తెచ్చుకున్న తరువాత.. రాజకీయరంగం వైపు ఎన్టీఆర్ దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో తెలుగు ప్రజలకు కనీస గౌరవ మర్యాదలు దక్కడం లేదని భావించిన ఎన్టీఆర్.. తనను ఆరాధిస్తున్న సామాన్య ప్రజల కోసం ఏదైనా చేయాలన్న సంకల్పంతో రాజకీయ ప్రవేశం చేశారు. 1982 మార్చి 29న తన మాతృభాషను స్మరిస్తూ తెలుగుదేశం పార్టీ నేలకొల్పారు. తెలుగు నేలపై కేవలం 9 నెలల వ్యవధిలోనే.. 198 జనవరి 5న జరిగిన ఎన్నికల్లో విజయ దుందుభి మోగించారు. జనవరి 9వ తేదీన తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు ఎన్టీఆర్. 1984 ఆగస్టులో ఎన్టీఆర్ పదవి నుంచి తొలగించబడినప్పుడు కేవలం నెల రోజుల్లోనే ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడంలో ప్రజల పోరాటం అనన్య సామాన్యమనే చెప్పాలి. 1984లో తన ప్రాంతీయ పార్టీని జాతీయ పార్లమెంట్‌లో ప్రతిపక్షంగా నిలిచేలా చేశారు ఎన్టీఆర్. వరుసుగా 1983 84 85 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కుతుంది. 1994లో ప్రత్యర్థి పార్టీని ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత సాధించిన విధంగా ఎన్టీఆర్ ఓడించారు.
ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టం
తెలుగు ప్రజలన్న, తెలుగు భాష అన్న ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టం. తెలుగు వారి పట్ల కాంగ్రెస్ అగ్ర నాయకులు వ్యవహరిస్తున్న తీరు, తెలుగు నాయకులను అవమానిస్తున్న విధానాలను చూసి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. తెలుగు భాషాభివృద్ధి కోసం కూడా ఆయన ఎంతగానో కృషి చేశారు. ఎన్టీఆర్ ను చూడగానే తెలుగుదనం ఉట్టిపడేలా కట్టుబొట్టు కనిపిస్తుంది. తెలుగు జాతి అభ్యున్నత కోసం ఎంతగానో కృషిచేసిన అన్న నందమూరి తారక రామారావు.. తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.
సంక్షేమ పథకాలకు ఆద్యుడు
సంక్షేమ పథకాలకు ఆధ్యుడిగా ఎన్టీఆర్‌ను అందించారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, రైతులకు 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్, పేదలకు జనతా వస్త్రాల పంపిణీ, నిరుపేదలకు ఆవాసయోగ్యం కల్పించేందుకు పక్కా గృహాల నిర్మాణం, వితంతువులు, వృద్ధులకు పింఛన్లు వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించిన ఘనత ఎన్టీఆర్ కి దక్కుతుంది.
ఈ విషయాలు చదవండి
* ఎన్టీఆర్ 1923 మే 28న నిమ్మకూరులో జన్మించారు. 1996 జనవరి 18న కన్నుమూశారు.
* 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ప్రచార రీత్యా 95 రోజులు 3,500 కి. అది ఒక ప్రపంచ రికార్డుగా అభివర్ణిస్తారు.
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీఆర్ మొదటి కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రిగా పనిచేశారు.
* 1940 ప్రాంతంలో కుటుంబానికి అండగా ఉండటం విజయవాడలోని హోటళ్లకు ఎన్టీఆర్ పాలు పోసేవారు.
* 40 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. ప్రముఖ కూచిపూడి డాన్సర్ వెంపటి జనసత్యం దగ్గర ఆయన నృత్యం నేర్చుకున్నారు.
* ఎన్టీఆర్ ఒకసారి న్యూయార్కు వెళ్ళినప్పుడు అక్కడ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూసి మంత్రముగ్ధులయ్యారు. అటువంటి విగ్రహం హైదరాబాదులో కూడా ఉండాలని భావించి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.