హైదరాబాద్, ఈవార్తలు : విభజన సమస్యలపై చర్చిద్దామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాసిన లేఖకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. విభజన సమస్యల పరిష్కారానికి ఓకే చెప్పిన ఆయన.. చంద్రబాబుకు ప్రత్యుత్తరం రాశారు. ఈ నెల 6వ తేదీన సాయంత్రం ప్రజాభవన్‌లో విభజన సమస్యలపై చర్చిద్దామని రేవంత్ ఆహ్వానించారు. రెండు రాష్ట్రాల అభివృద్ధితో పాటు విభజన సమస్యలపై పరిష్కారానికి మార్గం కనుగొనాల్సిన అవసరం ఉందని చెప్పారు. చంద్రబాబు రాసిన లేఖను చదివానని, ఆయనను భేటీకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
కాగా, ఇప్పటికే చంద్రబాబు.. రేవంత్ రెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం విభజన పరిష్కారం దిశగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో చంద్రబాబు సూచించారు. పొరుగు రాష్ట్రాలుగా పరస్పర సహకారం అందించుకుందామని అన్నారు. తెలుగు రాష్ట్రాలకు సీఎంలుగా ఉన్న మనం రెండు రాష్ట్రాల సమగ్ర, సుస్థిరాభివృద్ధి కోసం పరస్పరం సహకరించుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయి పదేళ్లు గడిచాయని, పునర్విభజన చట్టం ప్రకారం ఇంకా ఎన్నో సమస్యల పరిష్కారం కావాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను కూర్చొని పరిష్కరించుకుందామని. దీంతో.. చంద్రబాబు లేఖపై రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి, ప్రజాభవన్‌కు ఆహ్వానించారు.
ఇది కూడా చదవండి:
రేవంత్ రెడ్డి గారూ ఓసారి కలుద్దాం.. తెలంగాణ సీఎంకు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ