ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపై ఆ పార్టీ నాయకుల్లో గందరగోళం నెలకొంది. 151 స్థానాలు నుంచి 11 స్థానాలకు పడిపోవడం పట్ల అనేకమంది సీనియర్ నాయకుల్లో అంతర్మధనం మొదలైనట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయంగా సేఫ్ జోన్ ఎంచుకునే పనిలో చాలా నాయకులు కనిపిస్తున్నారు. ఈ విధంగానే ఇతర నేతలు ఇప్పటికే పార్టీని వీడిపోగా, మరికొందరు బాటలో పయనించడానికి సిద్ధమవుతున్న దృశ్యాలు. ఈ తరహా ఆలోచనలో ఉన్న నేతలను చేర్చుకునేందుకు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ సుముఖంగా చూపుతోంది. ముఖ్యంగా శాసనసభలో పూర్తి మెజారిటీతో ఉన్న కూటమి పార్టీకి బిల్లులు ఆమోదింపజేయడం పెద్దగా కష్టం కాకపోవచ్చు. కానీ, శాసనమండలిలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో బలం ఉంది. ఆ పార్టీకి మెజారిటీ కంటే ఎక్కువ ఎమ్మెల్సీలు ఉండటంతో శాసనమండలిలో కీలక బిల్లుల ఆమోదం ఇబ్బందిగా మారవచ్చు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీలు టిడిపికి చెందిన మంత్రులతో టచ్లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. వీరిలో రాజకీయంగా దూకుడు లేని, ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీవ్ర స్థాయిలో స్పందించని, టిడిపిపై విమర్శలు చేయని వారిని మాత్రమే పార్టీలోకి తీసుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. కనీసం ఐదు మంది ఎమ్మెల్సీలు కొద్ది టిడిపిలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు చెబుతున్నారు.
అయితే, వీరు ఎవరు అన్నదానిపై మాత్రం టిడిపి నుంచి లీకులు ఇవ్వడం లేదు. చాలా గుట్టుగా ఎమ్మెల్సీలతో టిడిపికి చెందిన కీలక నాయకులు చర్చలు జరుపుతున్నారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా వైసిపిపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. అత్తెసరు మెజారిటీతో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో కీలక బిల్లులను ఆమోదించాలంటే ఏపీలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 11 మంది రాజ్యసభ ఎంపీలు అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే వివిధ రాజ్యసభ ఎంపీలను చేర్చుకునేందుకు బిజెపి కూడా సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోంది. అందుకు అనుగుణంగా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఎంపీలతో కలిసి బిజెపి ముఖ్య నాయకులు సమాలోచనలు జరుపుతున్నారు. అయితే, వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన వారిలో ఇద్దరు, ముగ్గురు మినహా మిగిలిన వారు ఎవరు పార్టీ మారేందుకు అవకాశం ఉండదని చెబుతున్నారు. కానీ, ఆ పార్టీలో మొన్నటి వరకు నెంబర్-2గా వ్యవహరించిన కీలకను చేర్చుకుంటే మిగిలిన వారు కూడా బిజెపిలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుందని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగానే చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. కానీ ఈ చర్చలు ఎంత వరకు సఫలం అవుతాయన్న దానిపై సర్వత్ర ఆసక్తి ఉంది. ఏది ఏమైనా ప్రస్తుతం ఆపరేషన్ వైసిపి నడుస్తున్నట్లు చెబుతున్నారు. టిడిపి శాసనమండలిలో బలం పెంచుకునేందుకు వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలపై కన్ను వేయగా, భారతీయ జనతా పార్టీ అదే పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలను తమ పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు ఏ విధంగా మారబోతున్నాయో అన్నది వేచి చూడాల్సిందే.