గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కలిసి కూటమిగా ఏర్పాటై పోటీ చేసి విజయం సాధించాయి. వైసీపీపై అద్భుత విజయం సాధించి కూటమి నేతలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పాటై అయిదు నెలలు కావస్తోంది. అయితే, కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. రాష్ట్ర స్థాయిలో నాయకత్వం సమిష్టిగా పనిచేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం కార్యకర్తలు కలిసి పని చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో అనేక చోట్ల వాగ్వాదాలు, గొడవలు కూటమి నేతల మధ్య చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లు, జన సైనికుల మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఈ పరిస్థితి మరింత పెరిగింది. ఒకరకంగా చెప్పాలంటే చేయి జారిపోతున్న పరిస్థితి. అగ్ర నేతలు కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దకపోతే చిలికి చిలికి గాలి వానగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు. గ్రామస్థాయి నుంచి ప్రారంభమైన అంతరం మండల స్థాయికి, ఇప్పుడు నియోజకవర్గస్థాయికి చేరింది. కాకినాడ రూరల్, నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యేలు టిడిపి నాయకులను దూరం పెడితే.. ఎర్రగొండపాలెంతోపాటు టిడిపి ఎమ్మెల్యేలు ఉన్న అనేక నియోజకవర్గాల్లో జనసేన నాయకులను పట్టించుకోవడం లేదు. ఇలాంటి చోట్ల ఆయా పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు రగిలిపోతున్నారు.
పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు మరింత వేడి రాజేస్తోంది. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థికి సంబంధించి కొంతమంది టిడిపి నాయకులు జనసేన పార్టీ కండువా వేసుకోలేదు. దీంతో జనసేన నేతలు అభ్యంతరం తెలిపారు. ఇది చాలా చిన్న సమస్య. ఎన్నికల సమయంలో టిడిపి, జనసేన, బిజెపి పార్టీల కండువాలను అందరూ కప్పుకున్నారు. ఇప్పుడు కూడా జనసేన శ్రేణులు అభ్యంతరం తెలుపగానే టిడిపి నాయకులు జనసేన కండువాలు ధరించి ఉంటే ఎటువంటి సమస్య ఉండేది కాదు. ఈ చిన్న విషయానికి ఇరు వర్గాల మధ్య మాట, మాట పెరిగి రచ్చకెక్కారు. పెద్దాపురం నియోజకవర్గంలోనూ ఇలాంటి ఘటన జరిగింది. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫోటో ముద్రించలేదనే విషయంలో స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సమక్షంలో తెలుగు తమ్ముళ్లు, జనసేన నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. కాకినాడ ఎంపీ శ్రీనివాస్ ఉదయానికి వ్యతిరేకంగా కొంత మంది టిడిపి నాయకులు నేరుగా రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి అనుకూలంగా మారిపోయారని ఆరోపణలు చేశారు.ఇలాంటి చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా చేసుకుని స్థానిక నాయకులు రచ్చకెక్కుతున్నారు.
కొన్ని పదవులు, చిన్న చిన్న కాంట్రాక్టు పనుల విషయంలో ఈ పార్టీ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టిడిపి, జనసేన నాయకులు మధ్య సఖ్యత పూర్తిగా లోపించింది. అక్కడ టిడిపి.. జనసేనకు చెందిన నాయకులను కనీసం పరిగణలోకి తీసుకుందామని ఆరోపణలు వస్తున్నాయి. సంబంధిత స్థానిక నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇరు పార్టీల మధ్య ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన కొందరు వైసీపీ నాయకులు కూడా కారణమవడంతో గొడవ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఎన్నికల అనంతరం వైసీపీకి చెందిన నేతలు జనసేనలో చేరారు. ఇది కొంత ఇబ్బందికరంగా, కూటమి పార్టీల మధ్య చిచ్చుకు కారణం అవుతోంది. వైసీపీ జనసేనలో చేరిన తర్వాత ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయని తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా చెబుతున్నారు. ఈ తరహా ఇబ్బందులను పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ఉన్నత స్థాయి కమిటీని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి అగ్ర నాయకత్వం ఎటువంటి ఆలోచన చేస్తుందో చూడాలి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ గొడవలకు ఎలాంటి పుల్ స్టాప్ లభిస్తుందో చూడాలి.
కామారెడ్డి ఘటన | హనుమాన్ చాలీసా ఫ్లెక్సీకి నిప్పు.. కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు
వైట్ డిశ్చార్జ్ | వైట్ డిశ్చార్జి నుంచి ఉపశమనం పొందాలంటే..