అమరావతి, ఈవార్తలు : ఏపీ ఎన్నికల్లో ఘోర ఓటమి.. అధికార పార్టీ (టీడీపీ-జనసేన కూటమి) నేతల నుంచి దాడులు.. రెడ్ బుక్ అంటూ హెచ్చరికలు.. దానికి తోడు కుటుంబ సమస్యలు.. చెల్లి షర్మిల నుంచే విమర్శల బాణాలు.. ఇవన్నీ తట్టుకొని నిలబడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు వైసీపీ అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి. పార్టీ నేతలు, కార్యకర్తలను కాపాడేందుకు వెనక్కి తగ్గలేదు అన్న ఆయన.. ఆ దిశగా చర్యలు కూడా చేపట్టారు. కానీ, ఇంటి సమస్యలు రచ్చకెక్కడం తీవ్ర తలనొప్పిగా మారాయి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడే నాయకుడిలో అత్యుత్తమ ప్రతిభ బయటికి వస్తుందని అంటారు. అలాంటి పరిస్థితే జగన్‌ది కూడా. తనను నమ్మకున్నవాళ్ల కోసం నిలబడుతున్నాడు. జగన్‌కు పోరాడటం కొత్త కాదు. అరెస్టులు, జైలు కొత్త కాదు. పరిస్థితులకు వ్యతిరేకంగా ఉన్నప్పుడే నిలబడగలిగాడు. కానీ అప్పుడు జనం జగన్‌తో ఉన్నారు. ఇప్పటి పరిస్థితి వేరు. నేను అనుకున్న ఓటర్లే జగన్‌ను దూరం పెట్టారు. ఎన్నికల ముందు ఎక్కడికి వెళ్లినా ప్రజల అభిమానాలు అందుతాయి. అలాంటిది కేవలం 11 సీట్లే సాధించడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అసలు ఎలా ఓడిపోయాం! అని నిట్టూర్చారు కూడా.
అదంతా పక్కనపెడితే.. కుటుంబ సమస్యలు ఆయనకు ఇబ్బందిగా మారడం సాధారణ ప్రజలకు కూడా మింగుడు పడటం లేదు. జగన్ తన తల్లి, చెల్లిని కూర్చోబెట్టుకొని మాట్లాడితే సరిపోతుంది కదా అని అన్నవాళ్లే. అయితే, కుటుంబాన్ని చక్కదిద్దేందుకు జగన్ ఎన్ని తంటాలు పడుతున్నారో బయటికి తెలియదు. తెలిసినా.. కొందరు (ఓ వర్గం మీడియా) బయటికి తెలియకుండా జాగ్రత్త పడతారు. అది వారికి అవసరం. ఆ మీడియా ఆయనను నిత్యం దోషిగా బోనులో నిలబెడుతున్నా.. జగన్ సహనం కోల్పోకుండా నటించారు. అది ఆయన పరిణతికి నిదర్శనం.
వైఎస్ షర్మిల తన అన్న జగన్‌ను రాజకీయంగా దెబ్బతీయాలనుకున్న ప్రతి చోటా దెబ్బ తీశారు. ఒకప్పుడు తన అన్నను గెలిపించిన చెల్లే.. మొన్నటి ఎన్నికల్లో ఓటమికి ఒక కారణం అయ్యారన్నది జగమెరిగిన సత్యం. మరోవైపు.. వైఎస్ విజయమ్మ కూడా జగన్‌కు సానుకూలంగా ఎక్కడా ప్రకటన చేయలేదు. పైగా, పార్టీ పదవికి రాజీనామా చేశారు. ప్రజల్లో జగన్ పై కొంత వ్యతిరేకత వచ్చిందని తెలుస్తోంది. కానీ.. ప్రత్యర్థులు అంతా కలిసి తన కొడుకుపై దాడి చేస్తుంటే ఏ తల్లి అయినా ఊరుకుంటుందా? తన కుటుంబ సమస్యలను అస్త్రంగా చేసుకొని కుటుంబాన్నే పడగొడతామనుకుంటే ఇంటి పెద్దగా చూస్తూ సహిస్తుందా? సహించదు. వైఎస్ విజయమ్మ ఇప్పుడు చేసిందదే. లోకమంతా దాడిచేసినా.. తల్లి తన బిడ్డను రక్షించుకునేందుకు చేయవలసిందంతా చేస్తుంది. ఇక్కడ.. వైఎస్ విజయమ్మ చేసింది అదే. ఆమె ప్రయోగించిన ‘వీడియో’ అస్త్రం తల్లి ప్రేమకు నిదర్శనం.
ఇంటిలో తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. జగన్‌ను కాదని, విజయమ్మ.. షర్మిల పక్కన నిలబడ్డారు. తాజాగా వీడియో సందేశం ద్వారా కొడుకుపై ప్రేమను బయటపెట్టుకున్నారు. ఈ వీడియో చూస్తే జగన్‌కు వెయ్యి ఏనుగుల బలం అవుతుంది. ‘చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు. అంతమాత్రాన తల్లికి కొడుకు కాకుండా పోతాడా?’ అన్న వ్యాఖ్యలతో విజయమ్మ ఇంకో మెట్టు ఎక్కేశారు. తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అంటే.. తన కొడుకు కోసం తాను చేయాల్సింది అంతా చేస్తానని చెప్పకనే చెప్పారు. తన కన్నబిడ్డలే కొట్లాడుకుంటుంటే ఆ తల్లి పడే మనోవేదన వర్ణణాతీతం. ఎప్పటికైనా వాళ్లు కలిసిమెలిసి తపన పడుతుంది. విజయమ్మ క్షణక్షణం కోరుకుంటున్నదీ అదే.. తన కొడుకు, బిడ్డ కలవాలని. తల్లిగా విజయమ్మ అండ జగన్‌కు దొరికినట్టే. చెల్లి కూడా కలిసి వస్తే.. జగన్‌కు తిరుగుండదు. రాజకీయంగా పోరాడేందుకు కావాల్సినంత బలం దొరుకుతుంది.
ఏపీలో నిరుద్యోగులకు షాక్.. మెగా డీఎస్సీ విడుదల వాయిదా.!
చలికాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి చిట్కాలు