బెంగళూర్ జట్టు మరో విజయం సొంతం చేసుకుంది. పంజాబ్ జట్టును ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన కోహ్లీ సేన గెలుపు సొంతం చేసుకుంది. పాయింట్ల పటికలో 5వ స్థానానికి చేరింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ సేన 20 ఓవర్లకు 174 పరుగులు చేసింది. 175 లక్ష్య చేధనతో బరిలో దిగిన పంజాబ్ జట్టు 150 పరుగులకే చేతులెత్తేసింది. 24 పరుగుల తేడాతో ఓటమి పాలయింది.
రెగ్యులర్ కెప్టెన్ ఫాప్ డ్యూప్లెసిస్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజు మ్యాచులో కెప్టెన్సీ బాధ్యతలను కోహ్లీకి అప్పగించాడు. మరోవైపు పంజాబ్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఈ రోజు మ్యాచుకు దూరమయ్యాడు. శామ్ కరన్ సారధ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ మ్యాచ్ పంజాబ్ జట్టుకు కాలిసి రాలేదు. ఫీల్డింగ్ సందర్భంగా చేసిన పొరపాట్లు, బ్యాటింగ్ సందర్భంగా చేసిన మరికొన్ని పొరపాట్లు ఆ జట్టును పరాజయం వైపు నడిపించాయి.
27 పరుగులకే 3 వికెట్లు
175 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ జట్టుకు బెంగళూర్ బౌలర్ షాక్ ఇచ్చారు. త్వరత్వరగా 3 వికెట్లు తీశారు. మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీయగా, హసరంగా ఒక వికెట్ పడగొట్టాడు. 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పంజాబ్ జట్టు అక్కడి నుంచి కోలుకోలేక పోయింది. సిమ్రాన్ సింగ్, జితేశ్ శర్మ జట్టును గెలిపించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వీరిద్దరు తప్ప మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలం చెందడంతో పంజాబ్ పరాజయం పాలయింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లు వేసిన సిరాజ్ 4 వికెట్లు తీశాడు. ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పంజాబ్ బ్యాటర్లు పరుగులు చేయకుండా కట్టడి చేశాడు. ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేసి రనౌట్లు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.