- ఎంపిక కావడం సంతోషం
లండన్: వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన టెస్ట్ టీమ్‌లో తనకు చోటు దక్కడంపై పేసర్ నవ్‌దీప్ సైనీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తనకు అవకాశం దక్కుతుందని ఊహించలేదన్నాడు. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత్, టెస్ట్ టీమ్ వివరాలను బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. టెస్ట్ టీమ్‌లో చతేశ్వర్ పుజారాతో పాటు ఉమేశ్ యాదవ్‌లపై వేటు వేసిన బీసీసీఐ.. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి విశ్రాంతినిచ్చింది. షమీ స్థానంలో నవదీప్ సైనీకి అవకాశం కల్పించింది. 2021 జనవరి నుంచి పర్యటనలు ఆడని సైనీ.. వెస్టిండీస్‌కు ఎంపిక కావడంపై సంతోషం వ్యక్తం చేశాడు. కౌంటీ క్రికెట్‌లో ఆడేందుకు నవ్‌దీప్ సైనీ ఇంగ్లండ్ వెళ్లగా.. అతనికి భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది. తన సెలెక్షన్‌పై స్పందించిన సైనీ.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు నెట్‌బౌలర్‌గానైనా తీసుకుంటారని భావించాడు. ‘నేను కౌంటీ క్రికెట్ ఆడేందుకు లండన్‌కు వచ్చాను. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు వెస్టిండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు నేను ఎంపికయ్యానని తెలిసింది. అయితే ఈ సిరీస్‌కు ఎంపికవుతున్నానని నేను ఊహించలేదు. ఇటీవల ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్‌కు నెట్ బౌలర్‌గా లేదా స్టాండ్ బై ప్లేయర్‌గా అయినా తీసుకుంటారని భావించారు. అందుకే, ఐపీఎల్ సమయంలోనే డ్యూక్ బాల్స్‌తో ప్రాక్టీస్ చేశా. వెస్టిండీస్‌కు వెళ్లే ముందు ఒక కౌంటీ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ఇది నాకు మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడుతుంది. నేను వెస్టిండీస్ పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. తొలిసారి వెళ్లినప్పుడు నాకు ఆడే అవకాశం రాలేదు. అక్కడి వాతావరణం గురించి తెలుసు. పిచ్‌లు చాలా స్లోగా, నెమ్మదిగా ఉంటాయి’అని నవదీప్ సైనీ చెప్పుకొచ్చాడు. కౌంటీల్లో వోర్సెస్టర్‌షైర్ నాలుగు మ్యాచ్‌లు ఆడేందుకు సైనీ ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆదివారం డెర్బీషైర్‌తో మ్యాచ్ ఆడిన అనంతరం సైనీ విండీస్‌కు బయలుదేరే అవకాశం ఉంది. భారత్- వెస్టిండీస్ మధ్య తొలి రైలు డొమినికాలో జులై 12–16 వరకు, రెండో జమైకాలో జూలై 20–-24 వరకు జరగనుంది.