- మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్
ముంబై: క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా ఆసియా కప్‌లో భారత్, పాక్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఎవరు ఎక్కువ పరుగులు చేస్తారు? ఎక్కువ వికెట్లు ఎవరు తీసుకుంటారు? ఎవరు గెలుస్తారు? అని తెగ అంచనాలు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అందరూ ఇండియా, పాకిస్తాన్ మీద ఫోకస్ పెట్టడంపై చురకలేశాడు. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగుతున్న శ్రీలంకను తక్కువ అంచనా వేయకూడదని గవాస్కర్ చెప్పాడు. తమ టైటిల్‌ను డిఫెండ్ చేసుకునే సత్తా శ్రీలంకకు ఉందని సన్నీ అభిప్రాయపడ్డాడు. అందరూ ఇలా భారత్, పాక్ మ్యాచ్ గురించి చర్చిస్తుంటే.. శ్రీలంక వచ్చి ట్రోఫీ కొట్టేస్తుందని హెచ్చరించాడు. ఇప్పటి వరకు అత్యధిక సార్లు ఆసియా కప్ నెగ్గిన జట్లలో శ్రీలంక రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ట్రోఫీని భారత్ ఏడు సార్లు నెగ్గగా.. శ్రీలంక ఆరు సార్లు ఆసియా కప్పు నెగ్గింది. ఈ విషయం మర్చిపోకూడదని సునీల్ గవాస్కర్ చెప్పాడు. ‘ఆసియా కప్‌లో భారత్, పాక్ వైరం గురించి మనందరం మాట్లాడుకుంటున్నాం. కానీ శ్రీలంకను కూడా మర్చిపోకూడదు. వాళ్లు కూడా ఇక్కడ ఉన్నారు. అంతేకాదు ఆసియా కప్ గెలుస్తూనే ఉన్నారు.
ఈ మూడు దేశాల మధ్య ఉండే రైవలరీ ప్రత్యేకం’ అని చెప్పుకొచ్చాడు. యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో శ్రీలంక విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అందరూ కూడా ఆ సమయంలో భారత్, పాక్ రెండు జట్లు ఫైనల్ చేరతాయని అనుకున్నారు. కానీ భారత్ కనీసం ఫైనల్ చేరలేకపోయింది. చివర్లో పాక్‌ను ఓడించిన శ్రీలంక ట్రోపీ ముద్దాడింది. అయితే ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. అయితే కేవలం పాక్‌పై ఫోకస్ పెట్టకుండా.. ట్రోఫీ గెలిచేందుకు ఆడటం ముఖ్యమని నిపుణులు అంటున్నారు. ఆసియా కప్‌లో భారత్, పాక్, నేపాల్ మూడు టీమ్స్ గ్రూప్-ఏలో ఉండగా.. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మూడూ గ్రూప్-బీలో ఉన్న సంగతి తెలిసిందే.