- 15 మందితో ప్రకటించిన బీసీసీఐ
పల్లెకెలె: ప్రపంచకప్ 2023 టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి భారత సెలెక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించారు. రోహిత్ శర్మతో కలిసి మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొన్న అగార్కర్.. జట్టు వివరాలను వెల్లడించారు.
ఆసియాకప్ 2023 టోర్నీకి ఎంపిక చేసిన జట్టునే కొనసాగించామని తెలిపిన అగార్కర్.. జట్టులో ఇద్దరు పోటీపడేందుకు ఉద్వాసన పలికినట్లు తెలిపారు. ప్రపంచకప్ టోర్నీలోనూ హార్దిక్ పాండ్యానే వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడని అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు రోహిత్, అగార్కర్ ఓపికగా సమాధానాలిచ్చారు. ఇక అందరూ ఊహించినట్లుగానే పేసర్ ప్రసిధ్ కృష్ణతో పాటు తెలుగు తేజం తిలక్ వర్మకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు. అద్భుతమైన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌తో పాటు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న రాహుల్‌ను పక్కనపెడతారని ప్రచారం జరిగినా.. సెలెక్టర్లు అతనే కొనసాగించారు. దాంతో సంజూ శాంసన్‌కు కూడా నిరాశే ఎదురైంది. స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌తో పాటు కుల్దీప్ యాదవ్‌ను కొనసాగించారు. సీనియర్ స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ పేర్లను గుర్తించారని ప్రచారం జరిగినా.. సెలెక్టర్లు పట్టించుకోలేదు. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్‌లు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో కూడా పెద్దగా మార్పులు జరగలేదు. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌తో తమ ప్రపంచకప్ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్‌తో తలపడనుంది.
భారత ప్రపంచకప్ జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), ఇషాన్ కిషన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.