కొలంబో : భారత్ – శ్రీలంక మ్యాచ్‌లో సరిగ్గా టాపార్ట్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు దునిత్ వెల్లేలా . రెండురోజుల క్రితం ప్రస్తుతం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న బౌలింగ్ దళమైన షహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా, హరీస్ రౌఫ్‌లను ఎదుర్కున్న భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. రోహిత్, గిల్‌లు అర్థ సెంచరీలు చేయగా కోహ్లీ, రాహుల్‌లు సెంచరీలతో కదం తొక్కారు. పాకిస్తాన్ బౌలర్లనే ఇంత బాదిన భారత బ్యాటర్లు ఇక లంక బౌలింగ్‌ను చీల్చి చెండాడుతారని అంతా భావించారు. కానీ ఆ పప్పులేమీ ఉడకలేదు. ఓ 20 ఏళ్ల కుర్రాడు.. భారత టాపార్డర్‌ను కకావికలం చేశాడు.లంకతో మ్యాచ్‌లో 11 ఓవర్లకు భారత స్కోరు 80-0. కానీ వెల్లలాగే వచ్చిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. 12వ ఓవర్లో అతడు వేసిన తొలి బంతికే గిల్ క్లీన్ బౌల్డ్. 14వ ఓవర్లో ఐదో బంతికి విరాట్ కోహ్లీ ఖేల్ ఖతం. 16వ ఓవర్లో రోహిత్ కూడా బౌల్డ్. 11 ఓవర్లలో 80-0గా ఉన్న భారత్.. 16 ఓవర్ వచ్చేసరికి 91-3గా మారింది. లంక జట్టు కూడా ఊహించని విధంగా భారత బ్యాటింగ్ లైనప్ వెన్ను విరిచాడు దునిత్ వెల్లేలా. తర్వాత కూడా భారత ఇన్నింగ్స్‌ను ఆదుకున్న కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలనూ ఔట్ చేసి ఫైఫర్ సాధించాడు.
ఎవరీ వెల్లలాగె..?
కొలంబోకే చెందిన వెల్లలాగె 2003లో జన్మించాడు. అతడి వయసు 20 ఏండ్లు. స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అయిన అతడు బ్యాటింగ్ కూడా చేయగల సమర్థుడు. ఐసీసీ నిర్వహించిన అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్‌లో శ్రీలంక జట్టుకు అతడే సారథిగా వ్యవహరించాడు. ఈ టోర్నీలో భాగంగా లంక ఆడిన తొలి మ్యాచ్ (ఆసీస్)లోనే ఐదు వికెట్లు తీశాడు. తర్వాత మ్యాచ్‌లోనూ అదే రిపీట్ చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా చెలరేగాడు. ఆ మ్యాచ్‌లో 130 బంతుల్లో 113 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ కూడా తీశాడు.