- తిర్మలాపురం కన్నీరు పెట్టింది..
ముద్రప్రతినిధి,మహబూబాబాద్: ఈత సరదా ఓ పసివాడి ప్రాణం తీసింది.. ఎస్సారెస్పీ కాలువ ఆ..పసిప్రాణాన్ని మింగేసింది., వారి దయనీయ స్థితిని చూసి తిరుమలాపురం గ్రామమంతా కన్నీరు పెడుతుంది. మహబూబాబాద్ జిల్లా కురవి ఉన్నట్లు తిరుమలాపురం గ్రామంలో ఉల్లెందుల స్వరూప జీవితమంతా విషాదంతో నిండిపోయింది. కట్టుకున్న భర్త ఇద్దరు పిల్లలు పుట్టాక ఆమె కర్మకు వదిలేసి మరో మహిళతో వెళ్ళిపోయాడు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఇద్దరు పసిపిల్లలను తీసుకొని కురవి అయిన తిర్మలాపురం పుట్టింటికి వచ్చింది. కొద్ది కాలానికి అండగా ఉంటారు అనుకున్న తల్లిదండ్రులు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు అసువులు బాసారు. పసిపిల్లలు ఇద్దరినీ పెంచుకునేందుకు.. కూలీ నాలి పనులు చేస్తూ కాలం వెలదీస్తున్న స్వరూప జీవితంలో ఎస్సారెస్పీ కాలువ మరో విషాదాన్ని నింపింది. స్వరూప పెద్దకుమారుడు ఏడవ తరగతి చదువుతున్న 12సంవత్సరాల ఉల్లెందుల మురళి ఈత సరదాతో మంగళవారం ఎస్సారెస్పీ కాలువలోకి దిగి ప్రవాహ వేగానికి తట్టుకోలేక కొట్టుకొని పోయాడు. వెతకగా..వెతకగా బుదవారం అదే కాలువలో శవంగా కనిపించాడు. కురవి పాఠశాలలో ఏడవ తరగతి చదువుకునే మురళి మంగళవారం స్కూలుకు వచ్చాడు.
స్కూల్ నుండి బయటకు వెళ్లిన మురళి కురవి సమీపంలో ఉన్న ఎస్సారెస్పీ కాలువలో దిగాడు. ప్రవాహ ఉధృతి అధికంగా ఉండటంతో కొట్టుకుపోయాడు. ఎస్సారెస్పీ కాలువలో బాలుడు గల్లంతు అయ్యాడనే సమాచారంతో, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక రంగంలోకి దిగారు. అధికారయంత్రాంగం మంగళవారం సాయంత్రం నుండి బుధవారం ఉదయం వరకు కాలువల వెంట వెతికారు. ఎట్టకేలకు మురళి మృతదేహాన్ని తాళ్ళసంకీస గ్రామ సమీపంలో కనుగొన్నారు. తన కొడుకు బతికి వస్తాడేమో అని గంపెడాశతో ఎదురుచూసిన స్వరూపకు పుత్రశోకమై మిగిలింది. కట్టుకున్న భర్త ఇద్దరు పిల్లలు పుట్టాక వదిలేసి వెళ్లిపోయారు, అండగా ఉంటారని తల్లిదండ్రుల పంచన చేరితే వారు అర్ధాంతరంగానే కన్నుమూసి మరోసారి అనాధను చేశారు.
పిల్లలపై ప్రేమతో అష్టకష్టాలు పడుతూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటే పాఠశాలకు వెళ్లి వస్తాను అన్న కొడుకు శవమై రావడంతో స్వరూప తన తలరాత ఇలా రాశావేంటి దేవుడు అని బోరున విలపిస్తాడు. గ్రామస్తులు, సంఘటన స్థలానికి వచ్చిన వారు సైతం ఆమె రోదనను చూసి కంటతడి పెడుతున్నారు. 12 సంవత్సరాల కొడుకు కాలువలో పడి కన్నుమూయడంతో ఉన్న ఒక్క చిన్న కొడుకు గుండెలకు అద్దుకొని విలపిస్తున్న స్వరూపను చూసి ప్రతి ఒక్కరు కంటతడి పెడుతున్నారు. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు.