ముద్రణ, కుషాయిగూడ: చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు (ఖైదీల వ్యవసాయ క్షేత్రం) నుంచి శిక్ష అనుభవిస్తున్న ఖైదీ పరారైన జీవిత సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మేకల కుంట తండాకు చెందిన మాలోతు హుస్సేన్ (55), తన భార్యను చంపిన కేసులో 2015లో జీవిత ఖైదీ శిక్ష పడింది. వరంగల్ జైలు నుంచి ఏడాదిన్నర క్రితం చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలుకు వచ్చి శిక్ష అనుభవిస్తున్నాడు.
ఈ జైలులో వంట పని చేస్తున్న మాలోతు హుస్సేన్…. గురువారం తెల్లవారుజామున 4:30 గంటలకు జైలు అధికారుల కళ్ళు కప్పి పరారయ్యాడు. కాగా మాలోతు హుస్సేన్ జనవరి రెండో తేదీన పెరోల్ పై విడుదలై ఫిబ్రవరి రెండో తేదీన జైలుకు వచ్చాడు. ఇక జీవిత ఖైదీ పరారైనట్లు గుర్తించిన చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు సూపరింటెండెంట్ కళాసాగర్ గురువారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.