ముద్రప్రతినిధి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు బస్ డిపోలో ఆగి ఉన్న బస్సులోపల ఉరివేసుకుని గార్లపాటి మహేందర్ రెడ్డి(50) అనే ఆర్టీసీ కండక్టర్ ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు బస్ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్న మహేందర్ రెడ్డి ఎప్పటిలాగే ఆదివారం ఉదయం ఇంటి నుండి డిపోకు డ్యూటీ కోసం వచ్చారు. డ్యూటీకి వెళ్లే సమయం అయినా మహేందర్ రెడ్డి కనిపించారు ఆయన కోసం కొంతసేపు వెతికారు. అనంతరం డిపోలో ఆగి ఉన్న ఒక బస్సులో మహేందర్ రెడ్డి ఉరివేసుకొని వేలాడుతున్నాడని సిబ్బంది గమనించారు. తొర్రూర్ ఆర్టీడీపో అధికారులు పోలీసులకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
తొర్రూరు మండలం కంఠాయపాలెంకు చెందిన మహేందర్ రెడ్డి తొర్రూరులోని టీచర్స్ కాలనీలో ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. ఎప్పటిలాగే డ్యూటీకి వచ్చారని ఇలా ఎందుకు జరిగిందో తనకు అంతు పట్టడం లేదని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. మహేందర్ రెడ్డి కి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉండగా, చిన్న కొడుకు ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. ఆర్టీసీ డిపోలో డ్యూటీ కోసం వచ్చిన కండక్టర్ ఉరివేసుకొని మరణించిన సంఘటన డిపో సిబ్బందితోపాటు తొర్రూరులో విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.