ఓటిపి చెప్పి రూ. 1.90 లక్షలు నష్టపోయిన భాదితుడు
ముద్రణ ప్రతినిధి, జగిత్యాల: మొబైల్ ఫోన్‌లలో ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ధర్మపురి సిఐ కోటేశ్వరు ప్రజలకు సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు క్రెడిట్ కార్డ్స్ బ్లాక్ అయినాయని, తిరిగి పునరుద్దరించడానికి OTP పంపిస్తామని, వచ్చిన ఓటిపి చెప్పాలని వచ్చిన మోసపూరిత కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సిఐ సూచించారు. ధర్మపురిలో జరిగిన సంఘటన వివరరాలను సిఐ వివరించారు. ధర్మపురి మండల కేంద్రానికి చెందిన చిలుక ముక్కు నాగరాజుకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీ క్రెడిట్ కార్డ్స్ బ్లాక్ అయినదని తిరిగి పునరుద్దరించడానికి OTP పంపిస్తామని, ఆ OTP చెప్పాలని చెప్పాడు.
మోసపూరిత కాల్ అని గమనించిన సదర్ వ్యక్తి తన మొబైల్ కు వచ్చిన OTPని గుర్తు తెలియని వ్యక్తికి చెప్పగా తన క్రెడిట్ కార్డు ఖాతా నుండి రూ. 1,90,000 విత్డ్రా అయ్యాయి. తర్వాత నాగరాజు గుర్తు తెలియని వ్యక్తి గురించి అడిగితే ఏ మాత్రం స్పందించక పోయేసరికి మోసపోయానని తెలుసుకుని ధర్మపురి పోలిస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు సిఐ తెలిపారు. కావున ప్రజలు సోషల్ మీడియా లో వచ్చిన ప్రకటనలు చూసి వారి తెలిపిన నంబర్లకు ఫోన్ చేసి వారికి డబ్బులు పంపి మోసపోకండి. మీరు ఆన్‌లైన్‌లో మోసపోయి, మీ డబ్బులు పోయినట్లు అయితే వెంటనే 1930కి కాల్ చేసి పిర్యాద్ నమోదు చేయాలని సిఐ సూచించింది.