- బైకు పైనుంచి దూసుకెళ్లిన లారీ
- ఇద్దరు అక్కడికక్కడే మృతి
- రెండు గ్రామాల్లో విషాదం
సిద్ధి పేట :ముద్ర ప్రతినిధి: రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న లారీ ముందు వెళ్తున్న బైక్ మీద నుంచి దూసుకెళ్లడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారిపై సిద్దిపేట జిల్లా, సిద్దిపేట అర్బన్ మండలం, రంగధాంపల్లి చౌరస్తా సమీపాన రెడ్డి సంక్షేమ భవన్ వద్ద ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. గుర్తు తెలియని లారీ దూసుకెళ్లడంతో జక్కుల రాజు యాదవ్ బూరుగు వెంకటేష్ గౌడ్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారులోని గాంధీ నగర్‌లో జరిగిన వేడుకలకు ఆదివారం సాయంత్రం హాజరైన యువకులు తమ స్వగ్రామానికి బైకుపై వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మరణించిన వారిలో జక్కుల రాజు యాదవ్ చిన్నకోడూరు మండలం కమ్మర్లపల్లి గ్రామస్తుడు కాగా బూరుగు వెంకటేష్ గౌడ్ చిన్నకోడూరు మండలం మైలారం గ్రామస్తుడని వీరిద్దరి మృతితో రెండు గ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. త్రీటౌన్ ఎస్ఐ సంపత్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.