టిఎస్ఎండిసికి ప్రాణాలు లెక్కలేదా?
మహాదేవపూర్, ముద్రణ: గండేపల్లి పంప్ హౌస్లో భూములు కోల్పోయిన స్థానిక గిరిజనులు ఒకవైపు అల్లాడుతుంటే ఇసుకసురుల చేతిలో ఇరికిన టీఎస్ఎండీసీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. కన్నెపల్లి గ్రామానికి చెందిన పిట్టల శంకర్ అనే యువకుడు కూలీ పని చేసుకుంటూ తన పిల్ల పాపలతో హాయిగా జీవిస్తున్నాడు. కష్టించిన పైసలతో చిరునవ్వు చెరగని కాపురాన్ని ఆనందిస్తున్నాడు. ఇద్దరు చిన్నారి బిడ్డల ముద్దు ముచ్చటలతో లేమిలోనూ ఆప్యాయతల అనురాగాల కలిమితో మొక్కవోని ధైర్యంతో హుషారుగా జీవిస్తున్నారు. మహాదేవపూర్ మండలం కన్నెపల్లి గ్రామానికి చెందిన పిట్టల శంకర్ తన కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్న తన భార్యకు అనారోగ్యం చేయడంతో మంచి వైద్యం ఇప్పించాలనే తలంపుతో భూపాలపల్లి జిల్లాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో రోడ్డుపైకి వచ్చి ఇసుక లారీ కింద మాంసం ముద్దగా మారి విగతజీవుడయ్యాడు. పాదాలు తల మినహా మిగిలిన భాగమంతా హృదయ విదారకంగా మరణించాడు.
ఆసుపత్రిలో ఉన్న భార్యకు గంటల తరబడి తన భర్త చనిపోయాడని తెలుసు. చిన్నారులు ఆటపాటలలోనే ఉన్నారు. నామమాత్రంగా పనిచేసే టీఎస్ఎండిసి నిర్వాహణకు గిరిజన కుటుంబం రోడ్డుపై పడింది. కన్నెపల్లి ఊరు ఊరంతా ఈ విషాద ఘటనతో తల్లడిల్లుతున్నారు. రాత్రి పది గంటల నుండి మూడు గంటల వరకు ఇసుక లారీలు నడవాలి. పోలీసులకు సిబ్బంది తక్కువగా ఉండటంతో టిఎస్ఎండిసి సెక్యూరిటీ గార్డులను రిక్రూట్మెంట్ చేసి పోలీసు శాఖకు అప్పగించారు. వీరు పోలీసు శాఖ నియంత్రణలో పనిచేయాలి. కానీ మామూళ్ల మత్తులో జోగుతున్న టిఎస్ఎండిసి చెప్పిందే పాటిస్తారు. వీరు రోడ్లపైకి రాత్రి 10 గంటల నుండి మూడు గంటల వరకు ఇసుక లారీలను అనుమతించాల్సి ఉంటుంది. కానీ ఏడున్నర గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
టీఎస్ఎండీసీ ఉద్యోగులు గానీ అధికారులు గానీ నియమ నిబంధనలను అతిక్రమించడం మాత్రమే తెలుసు. సమయం సందర్భం లేకుండా ఇసుక లారీ రోడ్లపైకి వచ్చి దూసుకుపోతుంటే రోడ్డుపై ప్రజలు నిత్యం భయం గుప్పిట్లో మగ్గుతున్నారు. ఇసుక వ్యాపారులకు, వాహనదారులకు వంద పాడడమే అధికారుల నిత్యకృత్యం. ఇలాంటి పరిణామాలలో అనేక ప్రమాదాలలో ఎంతో మంది మరణించినట్లు అధికారులు చీమకుట్టినట్లు కూడా వ్యవహరించారు. స్థానిక గిరిజనులు, యువకులు అనేకమంది మృత్యువాత పడుతున్నా భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టిఎస్ఎండిసి సంస్థ ద్వారా బాధిత గిరిజన కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.