జమ్ము: జమ్ము కాశ్మీర్ లోని జీలం నదిలో మంగళవారం తెల్లవారు జామున పడవ బోల్తాపడి ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. గాయపడిన మరో ముగ్గురు వ్యక్తులు చికిత్స పొందుతున్నారు. అయితే, పడవలో ఇంకా ఎంతమంది వున్నారన్న కచ్చితమైన సమాచారం తెలియాల్సివుంది. ఆరుగురు వ్యక్తులు మృతి చెందారన్నారని శ్రీ మహారాజా హరిసింగ్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ముజఫర్ జర్గర్ ధ్రువీకరించారు.
గత కొద్ది రోజులుగా తెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు జీలం నది ప్రవాహం పెరిగిన నేపథ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే స్టేట్ డిజా రెస్పాన్స్ ఫోర్స్ ఆస్టర్ ప్రాంతంలో సహాయక చర్యలను ముమ్మరం చేసింది. కాశ్మీర్ డివిజనల్ కమిషనర్, ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, శ్రీనగర్ పోలీస్ డిప్యూటీ కమిషనర్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ల ఆధ్వర్యంలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.