ముద్ర,సెంట్రల్ డెస్క్:- గుజరాత్‌లో 2005లో వెలికితీసిన ఓ పాము వెన్నెముక శిలాజాలం భూమిమీద ఇప్పటివరకు అతిపెద్ద పాము అవశేషమని శాస్ర్తవేత్తలు నిర్వహించారు. ఆ పాము టీ రెక్స్ కన్నా పొడవైనదని చెప్పారు. ఐఐటీ రూర్కీకి చెందిన శాస్ర్తవేత్తలు 2005లో పాము శిలాజాలానికి వాసుకి ఇంటికస్ అని పేరు పెట్టారు. తాజాగా దాన్ని జెయింట్ స్నేక్ గా నిర్ధారించారు. వివిధ జాతులు ప్రత్యేకించి సరిసృపాల (రెప్టైల్స్) ఆవిర్భావం, పరిణామంలో భారత్‌తో ఉన్న సంబంధం ఈ పరిశోధనలో ఉందని చెప్పారు.
పాము శిలాజాలానికి చెందిన 27 వెన్నెముక భాగాలను కనుగొన్నారు. వాటిలో కొన్ని ఎముకలు భారీ కొండ చిలువను పోలి ఉన్నాయి. అలాగే అవి విషపూరితం కానివి అయ్యుండచ్చని శాస్ర్తవేత్తలు భావించారు. పాము పొడవు సుమారు 50 అడుగులు ఉండొచ్చని అంచనా వేశారు. అలాగే దాని బరువు సుమారు ఒక టన్ను అంటే ఏకంగా వెయ్యి కిలోలు ఉండొచ్చని లెక్కగట్టారు. ఆ పరిశోధనకు సంబంధించిన వివరాలు ‘స్ప్రింగర్ నేచర్’ లో సైంటిఫిక్ రిపోర్ట్స్ పేరుతో గురువారం ప్రచురితం అయ్యాయి.