ముద్ర,తెలంగాణ:- జీహెచ్‌సీ మేయర్ గద్వాల్ ఇంట్లోకి ఓ రౌడీ షీటర్ చొరబడి హల్ చల్ చేశాడు. రెండు రోజులపాటు మేయర్ ఇంటి చుట్టూ తిరిగిన రౌడీ షీటర్.. కండువా కప్పుకొని నేరుగా ఇంట్లోకి చొరబడ్డాడు. సిబ్బంది వారించే ప్రయత్నం చేసినా ఇంటిలోకి వెళ్లిపోయాడు. ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్లిన రౌడీ షీటర్ ను భద్రతా సిబ్బంది అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ లోని ఎన్బీటీ నగర్ లో ఈ ఘటన జరిగింది.
మేయర్ ఇంట్లో చొరబడిన వ్యక్తిని యూసఫ్ గూడకు చెందిన రౌడీ షీటర్ లక్ష్మణ్ గా పేర్కొన్నారు. లక్ష్మణ్ ఇంట్లో చొరబడిన సమయంలో మేయర్ విజయలక్ష్మీ ఇంట్లో లేరు. ఆమె తండ్రి కేశవరావుకు ఇటీవలే మోకాలికి శాస్త్ర చికిత్స జరగడంతో ఆమె ఆసుపత్రిలోనే ఉన్నట్లు సమాచారం. అయితే, మేయర్ ఇంటి వద్ద భద్రతా సిబ్బంది బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. వారు మేయర్ నివాసం వద్దకు చేరుకొని రౌడీ షీటర్ లక్ష్మణ్ ను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు చేరుకున్నారు. లక్ష్మణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని రిమాండ్ కు తరలించారు.