ముద్ర,తెలంగాణ:- వేసవి సెలవులు ముగుస్తున్న తరుణంలో విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల సమయంలో మార్పు పై నిర్ణయం తీసుకుంది. జూన్ 12తో వేసవి సెలవులు ముగియనుండడం, పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాల సమయాలను మారుస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.ఇదివరకు పాఠశాలలు ఉదయం 9ః30కి తెరుచుకొని సాయంత్రం 4ః30కి మూసేవారు. కానీ తాజాగా ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4ః45గంటలవరకు పాఠశాలను నడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పాఠమిక, ప్రాథమిక పాఠశాలల సమయపాలన పనుల వేళల్లో మార్పులకు ఆమోదం తెలిపినట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
విద్యార్థులు ఉదయం 9.30 కి స్కూలుకు వెళ్లడం వల్ల ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు చులకన భావం ఏర్పడుతోందనే విషయం విద్యాశాఖ అధికారుల దృష్టికి వచ్చింది. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను నడపాలని అధికారులు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు వివరించారు. ఈ ప్రణాళికనే ప్రాథమిక, ప్రాథమిక పాఠశాలలను 2024 – 2025 విద్యా సంవత్సరం నుంచి ఉదయం 9.00 గంటలకే ప్రారంభించాలనే ప్రతిపాదనకు ఆయన ఆమోదం కూడా తెలిపారు.