భూదాన్ పోచంపల్లి, ముద్ర:- భూదాన్ పోచంపల్లి మండలంలో కల్తీ పాల దందా జోరుగా కొనసాగుతోంది. కాసులకు కక్కుర్తి పడి పాలలో విష పదార్థాలు కలిపి ప్రజలకు సరఫరా చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్‌లో కల్తీ పాలు తయారు చేస్తున్న పాల వ్యాపారి సన్న ప్రశాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 60 లీటర్ల కల్తీ పాలు, 250 ఎమ్ ఎల్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 8 కేజీల డోలోపర్ స్కీమ్డ్ పాల పౌడర్ ప్యాకెట్లను భువనగిరి ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితుడిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు.