- నేడు హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన
- పాల్గొననున్న సీఎం, ఐటీ మంత్రి
- త్వరలోనే 15వేల యువతకు ఉద్యోగాలు
ముద్ర, తెలంగాణ బ్యూరో : అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ నేడు హైదరాబాద్‌లో తన కొత్త క్యాంపస్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనుంది. విదేశీ పర్యటన శాఖలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ,పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు ఈ నెల 5న ఆ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇందులో రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా కాగ్నిజెంట్ కంపెనీ పది రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టింది.ఒప్పందంలో భాగంగా తమ కంపెనీ విస్తరణకు సంబంధించిన ప్రణాళికలను ముందుగానే వెల్లడించారు.
ఇందులో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నది. విదేశీ పర్యటన ముగించుకొని నేడు హైదరాబాద్‌లో చేరుకోనున్న సీఎం రేవంత్‌రెడ్డి కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్‌తో కలిసి ఆ కంపెనీ శంకుస్థాపనలో పాల్గొంటారు. 1994లో చెన్నై కేంద్రంగా ఆవిర్భవించిన కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.హైదరాబాద్‌లో 2002 నుంచి కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కంపెనీకి ప్రస్తుతం ఐటీ కారిడార్‌లోని వివిధ ప్రాంతాల్లో ఐదు క్యాంపస్‌లు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 57 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్రంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్‌కు పేరుంది. గడిచిన రెండేండ్లలో ఈ కంపెనీ రాష్ట్రంలో 34 వివిధ విద్యాసంస్థల నుంచి 7500 మంది ప్రెషర్లకు ఉద్యోగాలు ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో కాగ్నిజెంట్ కంపనీ తెలంగాణ నుంచి రూ. 7725 కోట్ల ఐటీ ఎగుమతులను నమోదు చేసింది. గడిచిన అయిదేండ్లలో ప్రస్తుత సోషల్ రెస్సాన్సిబులిటీ కింద ఈ కంపెనీ రూ. 22.5 కోట్లతో వివిధ సామాజిక కార్యక్రమాలు చేపట్టారు.