- నేడు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్‌తో సీఎం భేటీ
- టీపీసీసీ, నామినేటెడ్ పోస్టులపై చర్చ
- అభ్యర్ధిత్వాలపై కసరత్తు
- త్వరలోనే అధికారిక ప్రకటన
ముద్ర, తెలంగాణ బ్యూరో : పీసీసీ చీఫ్, నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడుతోన్న ఆశావాహుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఆసక్తి రేపుతోంది. ఈ నెల 15న రాత్రి ఢిల్లీకి వెళ్లిన సీఎం.. శుక్రవారం తెలంగాణలో విదేశీ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయి.. పెట్టుబడుల అంశంపై చర్చలు జరిపారు. మరోవైపు తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధి అభిషేక్ సింఘ్వితో భేటీ అయి ఎన్నికను అనుసరించాల్సిన విషయంపై చర్చించారు. ఇదే కావాలంటే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే.రాహుల్ గాంధీతో భేటీ అయి పీసీ చీఫ్ ఎంపిక, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించాలని భావించారు. కానీ అనివార్య కారణాలతో భేటీ వాయిదా పడింది. దీంతో ఇప్పటికే ఆయా పోస్టులపై ఆశలు పెట్టుకున్న నేతల్లో ఉత్కంఠ పెరుగుతోంది.
ఆయా పోస్టులకు భారీగా పోటీ నెలకొనడంతో ఎవరెవరికి పదవులు వరిస్తాయోననే ఆసక్తి నెలకొంది. అయితే పీసీసీ అధ్యక్ష పదవికి చాలా మంది సీనియర్లు పోటీపడుతుండగా పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపునివ్వాలంటూ స్థాపనపై ఒత్తిడి తెస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం నేత సీఎంగా ఉన్న నేపథ్యంలో పీసీసీని బీసీ వర్గానికి అందించడానికి హై కమాండ్ ఆలోచిస్తోంది. దీంతో, పార్టీలో ఆ వర్గం నేతలైన మధుయాష్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, సురేష్ షెట్కార్ పేర్లు తెరమీదకు వచ్చాయి. ఇప్పటికే సురేష్ షెట్కార్ జహీరాబాద్ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తుండగా.. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా,ఎమ్మెల్సీగా, ప్రచారకమిటీ చైర్మన్‌గా ఉన్నారు. మహేష్ కుమార్‌గౌడ్‌కి అందరినీ కలుపుకొని పోయే నేతగా, సీఎం రేవంత్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్నది. అయితే ఏఐసీసీ స్థాయి పరిచయాలు అంతగా లేకపోవడంతో ఆయన పీసీసీ రేసులో వెనకబడ్డారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. మధుయాష్కీ గౌడ్‌కి ఏఐసిసి పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
ఇదీలావుంటే.. ఈసారి తమకు పీసీసీ చీఫ్ కేటాయించాలంటూ ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గ నేతలూ పట్టుబడుతున్నారు. ఈ కేటగిరిలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్ పేర్లు తెరమీదకొచ్చాయి. ఇందులో బలరాం నాయక్ తాను కూడా పీసీసీలో ఉన్నానని స్పష్టం చేశారు. ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గానికి అధిష్టానం అవకాశం కల్పించాలని అనుకుంటే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీళ్లిద్దరూ హైకమాండ్ వద్ద పదవికోసం పట్టుబట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే.. శ్రావణమాసం ముగిసేలోపు పీసీ చీఫ్‌ను నియమించాలని ఏఐసీసీ కోరుతోంది.మరోవైపు.. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా జగ్గారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సంపత్ కుమార్‌ల పేర్లు కూడా ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. పీసీసీ పదవులతో పాటు,కార్పొరేషన్ పదవుల పంపకాన్ని కూడా పూర్తి చేయాలనుకుంటున్నారు. త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే రాష్ట్రంలో 36 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ నెలాఖరులోపే మరో 25కుపైగా పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. తొలి దఫాలో పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కనివారు, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలు కలిపి 36 మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు అప్పగించారు. ఆ జాబితాలో చోటు దక్కని చాలా మంది రెండో జాబితాపై ఆశలు పెట్టుకున్నారు. వీరిలో సీనియర్లతో పాటు విద్యార్థి సంఘ నాయకులు, అధికార ప్రతినిధులు, మహిళా నేతలు ఉన్నారు. మరోవైపు.. విడత నామినేటెడ్ పదవుల జాబితాలో ఉన్న ఎమ్మెల్యేలకు దక్కనున్న రెండో కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా చర్చ జరుగుతోంది.
ఆర్టీసీ, సివిల్ సప్లైస్, మూసీ రివర్‌ఫ్రంట్‌లోని ముఖ్యమైన కార్పొరేషన్లను ఎమ్మెల్యేలకు అప్పగిస్తారని..సామాజిక సమీకరణల నేపథ్యంలో మంత్రివర్గంలో స్థానం దక్కని వారికి చైర్మన్ పదవులతోపాటు కేబినెట్ హోదా కల్పించాలని సీఎం కోరినట్లు తెలిసింది. ఇక బేవరేజెస్ కార్పొరేషన్, వైద్య మౌలిక సదుపాయాల కల్పన, హ్యాండ్‌లూమ్స్, గీత కార్పొరేషన్ ఇతర పోస్టులు కూడా ముఖ్య నేతలకు అప్పగించనున్నట్టు సమాచారం. వీటితో పాటు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కుల కార్పొరేషన్లకు కూడా ఈసారి చైర్మన్లను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు వైశ్య కార్పొరేషన్‌కు మాత్రమే చైర్మన్‌ను ప్రకటించగా.. మిగిలిన కులాల కార్పొరేషన్లకు కూడా చైర్మన్లను ప్రకటించాలని టీపీసీసీ నాయకత్వంపై ఒత్తిళ్లు వస్తున్నాయి.