ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అతి పెద్ద పండుగ సంక్రాంతి. ఎక్కడున్నా ఫెస్టివల్ సమయానికి సొంతూళ్లకు వెళ్తారు. బెంగుళూరు, ముంబై, చెన్నై వంటి నగరాల నుంచి లక్షలాది ఏపీకి వెళ్తారు. ఒక్క తెలంగాణ నుంచి సంక్రాంతికి ఏపీకి దాదాపు 15 లక్షల మంది వెళ్తారన్నది అధికారిక లెక్క.
సంక్రాంతి పండుగకు నాలుగు నెలల ముందే రైళ్లన్నీ నిండిపోయాయి. రిజర్వేషన్ ఓపెన్ చేసిన నిమిషాల్లోనే ఖాళీ అయిపోయింది. ప్రస్తుతం వెయిటింగ్ జాబితా భారీగా పెరిగిపోతోంది. సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి వెళ్లే రైళ్లలో ఏపీ టికెట్లు బుక్ చేసుకుందామంటే ‘నో టికెట్స్’ అని చూపిస్తుంది. వెయిటింగ్ లిస్ట్ రిగ్రేట్ స్టేటస్ చూపిస్తోంది.
ఈ నేపథ్యంలో వెయిటింగ్ జాబితాను తగ్గించేందుకు రెగ్యులర్ రైళ్లకు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేయడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అప్పటికీ సరిపోకపోతే మరో 400 స్పెషల్ సర్వీస్‌లు నడపాలని మధ్య రైల్వే అధికారులు ధృవీకరించారు. సికింద్రాబాద్ నుంచి ఏపీ, ఇతర ప్రాంతాలకు వెళ్లే గరీబ్ రథ్, ఫలక్‌నుమా, కోణార్క్, ఎల్టీటీ ముంబై, విశాఖ ఎక్స్‌ప్రెస్‌తో సహా అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు విశాఖపట్నం వైపు జనవరి 10, 11, 12 తేదీల్లో పూర్తి స్థాయిలో నిండిపోయాయి.
కాకినాడ వైపు వెళ్లే కాకినాడ ఎక్స్‌ప్రెస్, ఎల్ టీటీ- కాకినాడ చూపిస్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లు రిగ్రేట్ స్టేటస్ అని ప్రయాణికులు అంటున్నారు.. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, వెస్ట్ బెంగాల్ రైళ్లన్నీ ఏపీ మీదుగా వెళ్తాయి. వీటన్నింటిలో కూడా టికెట్లు అయిపోయాయి. రద్దీకి అనుగుణంగా వివిధ మార్గాల్లో 400 స్పెషల్ సర్వీస్‌లు నడపాలని ప్లాన్ చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.