ఢిల్లీ: భారీ ట్రాఫిక్ మధ్యలో భుజానికి బ్యాగ్ తగిలించుకుని ఉండగానే అందులో నుంచి రూ.40 లక్షలు ఎత్తుకెళ్లారు ముగ్గురు దొంగలు. సీసీటీవీ వీడియోతో ఈ చోరీ బయటపడింది. మార్చి 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 1వ తేదీ సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బ్యాగులో డబ్బు పెట్టుకుని బైక్‌పై రావడాన్ని గమనించిన ముగ్గురు దొంగలు అతడిని కొంతదూరం అనుసరించారు. మార్గమధ్యంలో ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బైక్ ఆగగానే.. వెనకే వచ్చి చోరీకి పాల్పడ్డారు. వాహనదారుడు ముందు సిగ్నల్ చూస్తుండగా.. దొంగల్లో ఒకడు వెనుక బ్యాగ్ తెరచాడు. మరో వ్యక్తిని డబ్బుల బ్యాగ్ తీసుకుని ఇంకొకరికి అందించాడు. క్షణాల్లో పని ముగించుకుని ఆ దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఆ సమయంలో డబ్బున్న బ్యాగ్‌ను ఆ వాహనదారుడు భుజానికే తగిలించుకుని ఉన్నాడు. అయినా అతడు చోరీని గమనించలేదు. అంతేనా.. ఆ సమయంలో బైక్ పక్కనే కార్లు కూడా ఆగి ఉన్నాయి. బైక్ ముందు నుంచి కొందరు పాదచారులు నడుచుకుంటూ వెళ్తున్నారు. అయినా.. ఏ ఒక్కరూ దొంగతనాన్ని గుర్తించకపోవడం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల్లో ఇద్దర్ని అరెస్టు చేశారు. దొంగల నుంచి రూ.38లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు ద్విచక్రవాహనదారులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు ముఠా పోలీసులు ఏర్పాటు చేశారు.