లెజెండరీ క్రికెటర్, శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన బయోపిక్ ‘800’. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. ముత్తయ్య పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, ఆయన భార్య మదిమలర్ పాత్రలో హీరోయిన్ మహిమా నంబియార్ నటించారు. ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ హిందీ భాషల్లో ఆయన విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో శివలెంక కృష్ణ ప్రసాద్ ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు… ఎస్పీ బాలసుబ్రమణ్యం అంకుల్ గారికి, నాకు కామన్ ఫ్రెండ్ ఒకరు ఉన్నారు. ఆయనకు శ్రీపతి తెలుసు. వాళ్లది కోయంబత్తూరులో సెటిలైన తెలుగు కుటుంబం. అతను తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతాడు. సినిమాలు అంటే ఆసక్తి. ఫిలిం మేకింగ్ కోర్సులు కూడా ఏవో చేశాడు. కామన్ ఫ్రెండ్ అడగడంతో ఎస్పీ చరణ్ తమిళంలో ‘వర్షం’ రీమేక్ చేసినప్పుడు… ఆ సినిమాకు అసిస్టెంట్ దర్శకుడిగా తీసుకున్నా.
ఆ సినిమా నిర్మాణ బాధ్యతలు అన్నీ నేనే చూశా. ఆ తర్వాత వెంకట్ ప్రభు దగ్గర నాలుగైదు సినిమాలకు దర్శకత్వ శాఖలో శ్రీపతి పని చేశాడు. మా నిర్మాణ సంస్థలోనే దర్శకుడిగా పరిచయం చేయాలని అనుకున్నాం. అయితే ముత్తయ్య మురళీధర్ బయోపిక్ చేసే అవకాశం వచ్చిందని చెబితే సంతోషంగా ఆ సినిమా చేసి రమ్మని నేనే చెప్పా. ఆగస్టు తొలి వారంలో అనుకుంటా… శ్రీపతి నుంచి ఫోన్ వచ్చింది. ‘సార్… మీరు 800 సినిమా టేక్ ఓవర్ చేయాలి’ అని అడిగాడు. దీనికి ముందు ఒక విషయం చెప్పాలి… ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందో శ్రీపతి నాకు చెబుతూ వస్తున్నాడు. షూటింగ్ చేయడానికి లండన్ వెళ్లినా, ముత్తయ్య మురళీధరన్ గారి సొంతూరు వెళ్ళినా… నాకు అప్డేట్స్ ఇస్తున్నాడు. ఇండియాలో సుమారు 1100 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. మేం ఎక్కువగా మల్టీప్లెక్స్ స్క్రీన్ ల మీద దృష్టి పెట్టాం. తర్వాత మెల్లగా థియేటర్లు పెంచుతూ వెళ్తాం. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది.