- సంక్రాంతి బరిలో కొత్త సినిమాలు
- ప్రతి సంక్రాంతికి తనను టార్గెట్ చేస్తున్న దిల్ రాజు
- హనుమాన్ ఈవెంట్లో చిరంజీవి వ్యాఖ్యలను వక్రీకరించారని ఆగ్రహం
- తప్పుడు రాతలు రాసే వెబ్ సైట్ల తాట తీస్తానంటూ వార్నింగ్
ప్రతి సంక్రాంతికి టాలీవుడ్ నుంచి కొత్త సినిమాలు రిలీజ్ కావడం ఆనవాయితీగా వస్తోంది. కొంతమంది హీరోలకు సంక్రాంతి ఓ సెంటిమెంట్ కూడా. అదే సమయంలో, సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలకే థియేటర్లు దొరుకుతున్నాయి, చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోందని ఎప్పటినుంచో విమర్శలు వచ్చాయి. వీటిలో ఎక్కువ శాతం విమర్శలు ప్రముఖ నిర్మాత దిల్ రాజు పేరుతో ముడిపడినవే. ఈ సంక్రాంతి కూడా ఎప్పట్లాగానే తనపై విమర్శలు షురూ చేశారంటూ దిల్ రాజు తాజాగా కనిపించారు. తనపై తప్పుడు వార్తలు రాస్తున్నాయంటూ కొన్ని వెబ్సైట్లపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంక్రాంతికి కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయని, ఏదో ఒకరకంగా నన్ను వివాదాల్లోకి లాగాలని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “నేను కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. మీ వెబ్ సైట్లకు వ్యూస్ వచ్చేందుకు నా పేరును వాడుకుంటే సహించేది లేదు… తాట తీస్తా! నా గురించి తప్పుడు వార్తలు రాసే వెబ్ సైట్లకు ఇదే నా హెచ్చరిక” అని దిల్ రాజు స్పష్టం చేశారు.
“నిన్న హను-మాన్ ఫంక్షన్ లో చిరంజీవి గారు మాట్లాడుతూ.. దిల్ రాజు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి… ఏ పరిస్థితుల్లో ఏం చేయాలో ఆయనకు తెలుసు అని మంచిగా చెప్పారు. కానీ చిరంజీవి గారి వ్యాఖ్యలను కొన్ని వెబ్ సైట్లు వక్రీకరించాయి. మరో అర్ధం వచ్చేలా ఆ వెబ్ సైట్లలో రాశారు. వెబ్సైట్ ప్రాముఖ్యతను పెంచుకునేందుకు ఇతరులను ఎందుకు వాడుకుంటున్నారు?
మీకేమైనా ఆ చిత్ర నిర్మాత చెప్పాడా…? ఆ వెబ్ సైట్లకు దమ్ముంటే ఆ నిర్మాతను ఈ వేదికపైకి తీసుకొచ్చి… నన్ను, ఆ నిర్మాతను ప్రశ్నించండి. ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్ను టార్గెట్ చేస్తారు? ఇండస్ట్రీలో 95 శాతం మంది నన్ను ఇష్టపడతారు. మిగిలిన ఐదు శాతం మంది నన్ను ఇష్టపడతారా లేదా అన్నది వాళ్లిష్టం. చాలామందితో నేను సంతృప్తికరంగా ఉన్నాను కాబట్టే ఇండస్ట్రీలో ఇవాళ నాకింత మంచిపేరుంది. దిల్ రాజు అంటే ఒక బ్రాండ్. కానీ వ్యాపారపరంగా వచ్చే కొన్ని వివాదాలను తీసుకుని వాటిని వాడుకుంటున్నారు. అది 100 శాతం తప్పు.
సంక్రాంతి సినిమాలకు సంబంధించి మొన్న ఛాంబర్ ద్వారా సమావేశం ఏర్పాటు చేసి రవితేజ గారిని ఒప్పించి ఒక సినిమా సంక్రాంతి బరి నుంచి పక్కకు జరిపాం. అది ఎంత కష్టమో మాకు తెలుసు. ఆ తర్వాత… దిల్ రాజు ఒక తమిళ సినిమా విడుదల చేస్తున్నాడంటూ వార్త రాశారు. ఎవరు చెప్పార్రా నీకు… నేను తమిళ సినిమా రిలీజ్ చేస్తున్నాను అని? ఏదైనా ఆధారం ఉందా? తెలుగులో ఇప్పుడు రిలీజ్ వద్దు అని ఆ తమిళ సినిమా కూడా వాయిదా వేయించింది. ఇందాక చెప్పాను కదా తాటతీస్తాను అని… దాన్ని ఈజీగా తీసుకోవద్దు. ఇన్నిరోజులు ఎలాగో నడిచిపోయాయి… ఇక నుంచి నా గురించి వివాదస్పదమైన వార్తలు రాస్తే ఊరుకునేది లేదు” అంటూ దిల్ రాజు ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు.