కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో శశికిరణ్ తిక్క సమర్పణలో ఆరమ్ ఆర్ట్స్ పతాకంపై సుమన్ చిక్కాల దర్శకత్వంలో శ్రీనివాసరావు తక్కలపల్లి, బాబి తిక్క నిర్మించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘సత్యభామ’. ఈ సినిమాలో నవీన్ చంద్ర కూడా ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం మే 24న హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు నటసింహ నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరైన ‘సత్యభామ’ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఈ సినిమా ట్రైలర్‌లో కాజల్‌ని చూసి చాలా ఆశ్చర్యపోయాను. మా భగవంత్ కేసరి సినిమాలో చేసింది. ఆ అమ్మాయి, ఈ అమ్మాయి ఒకరేనా అనిపించేంత వేరియేషన్ చూపించింది. ఆమె చేసిన ఫైట్స్, యాటిట్యూడ్ అద్భుతం. ఆర్టిస్ట్ అన్న తర్వాత అన్ని రకాల పాత్రలు చేయాలి. ఈరోజు నారద జయంతి. నాన్నగారు అన్ని రకాల పాత్రలు పోషించారు ఒక్క నారదుడు తప్ప. ఆ పాత్ర శ్రీనివాసకళ్యాణం చిత్రంలో చేసే అవకాశం నాకు వచ్చింది. అది నా అదృష్టం. నాన్నగారు చేయని పాత్ర నేను చేసాననే తృప్తి ఉంది. ‘సత్యభామ’ నిర్మించిన వారికి చాలా అనుభవం ఉంది. శశికిరణ్ సినిమాలకు డైరెక్షన్ చేశారు. అలాగే నిర్మాతలకు పంపిణీ రంగంలో కూడా అనుభవం ఉంది. వీరందరి అనుభవంతో సినిమాని అద్భుతంగానే తీసి ఉంటారు. తప్పకుండా ఇది అందరికీ నచ్చుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ భారతదేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో ఉంది. మనం అందించే సినిమాలకు, మనం ఇచ్చే సందేశాలకు యావద్ భారతదేశమే తలవంచింది. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా రావాలి. ‘సత్యభామ’ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.