తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కలిశారు. హైదరాబాద్ లోని సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన బాలకృష్ణ.. ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. బాలయ్య వెంట బసవతారకం హాస్పిటల్ ట్రస్ట్ సభ్యులు కూడా ఉన్నారు.
సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆయనను బాలకృష్ణ కలవడం ఇది రెండోసారి. తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణం స్వీకారం చేశాక.. డిసెంబర్ లో పలువురు సినీ ప్రముఖులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అప్పుడు రేవంత్ ని కలిసిన వారిలో బాలయ్య కూడా ఉన్నారు. ఇప్పుడు మరోసారి ఆయన సీఎంని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగాయి. జూన్ 4న ఫలితాలు వెలువడుతున్నాయి. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయడం, హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా మూడోసారి బాలకృష్ణ గెలవడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ ని బాలయ్య కలవడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సమావేశం వెనుక రాజకీయ ఉద్దేశం లేదని, బసవతారకం హాస్పిటల్ కి సంబంధించిన సేవా కార్యక్రమాల గురించి ఈ భేటీలో సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.