సినిమా పేరు : కీచురాళ్ళు
నటీనటులు: రజీషా విజయన్, విజయ్ బాబు, శ్రీనివాసన్, మణికందన్ పట్టాభి, రంజిత్ శేఖర్ నయ్యర్ నిర్వహించారు
సంగీతం: సిద్దార్థ్ ప్రదీప్
సినిమాటోగ్రఫీ: రాకేశ్ ధరన్
ఎడిటింగ్: క్రిష్టి సెబాస్టియన్
నిర్మాతలు : రాహుల్ రిజి నయ్యర్- సుజిత్ వారియర్
దర్శకుడు: రాహుల్ రిజి నయ్యర్
ఓటీటీ: ఈటీవీ విన్
కథ:
సైబర్ క్రైమ్ కి సంబంధించిన కొన్ని కేసులను పోలీస్ డిపార్టుమెంటు వారు రాధిక(రజీషా విజయన్) సాయం తీసుకుంటూ ఉంటారు. ఆమె తండ్రి ఒక సీనియర్ లాయర్. తండ్రి కూతుళ్లు మాత్రమే ఆ ఇంట్లో ఉంటూ ఉంటారు. ఒక రోజున ఆమె ఫ్రిజ్ రిపేర్ కి సంబంధించి ఒక నెంబర్ కి కాల్ చేస్తుంది. అవతల వ్యక్తి కాస్త అసభ్యంగా మాట్లాడటంతో కాల్ కట్ చేస్తుంది. ఫోన్లో ఆమెతో అలా మాట్లాడిన ఆ వ్యక్తిపేరు కిలి బిజూ. ఒక మాఫియా ముఠాకి సంబంధించిన లోకల్ గ్యాంగులో అతను ఒకడు. ఆ గ్యాంగ్ లో మొత్తం ఐదుగురు ఉంటారు. స్క్రాప్ బిజినెస్ చేస్తున్నట్టుగా అక్కడి వాళ్లను నమ్మిస్తూ పెద్ద గ్యాంగ్ ని రన్ చేస్తుంటారు. రాధిక వాయిస్ నచ్చడంతో, ఫేస్ బుక్ లోకి వెళ్లి ఆమె ఎలా ఉందనేది చూస్తారు. ఆమె గ్లామర్ గా కనిపించడంతో.. తరచూ కాల్స్ చేస్తూ అసభ్య వీడియోలు షేర్ చేస్తూ వేధించడం మొదలుపెడతారు. ఈ పరిశీలన రాధిక పోలీసుల దృష్టికి వెళుతుంది. పోలీస్ ఆఫీసర్ ఛార్లెస్ – అష్రఫ్ ఇద్దరు కూడా ఆమెతో ఉన్న పరిచయం కారణంగా తెలిసింది. ఆ రౌడీ గ్యాంగ్ ను పిలిచి వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు. ఆ సంఘటన దగ్గర నుంచి ఆ రౌడీలు మరింత రెచ్చిపోతారు. రాధికను, ఆమె తండ్రిని ఫాలో అవుతూ వేధించడం మొదలుపెడతారు. దాంతో ఆమె తన సైబర్ సెక్యూరిటీ బుర్రను వాళ్ల విషయంలో ఉపయోగిస్తుంది. స్క్రాప్ బిజినెస్ చేసే ఆ ఐదుగురి వెనుక పెద్ద నెట్ వర్క్ పనిచేస్తుందనే విషయం ఆమెకి అర్థమవుతుంది. తన నెట్ వర్క్ ను ఉపయోగించి, వాళ్ల అక్రమ రవాణాలను అడ్డుకుంటూ ఉంటుంది. దాంతో వాళ్లకి పెద్దమొత్తంలో నష్టాలు రావడం మొదలవుతుంది. ఫలితంగా అందరికి పైనున్న బాస్ నుంచి వాళ్లకి హెచ్చరికలు వస్తాయి. అప్పుడు వాళ్లకి రాధికపై అనుమానం వస్తుంది. రౌడీ గ్యాంగ్ నుండి రాధిక బయటపడిందా? ఆ గ్యాంగ్ వెనుక ఉన్న బాస్ ఎవరు? వాళ్ళు చేసే మోసాలు బయటపడ్డాయా? లేదా అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
రాత్రిపూట కీచు కీచుమని వచ్చే కీచురాళ్ళ శబ్దం వల్ల మనుషులకి ఆ భయం ఉంటుంది. అలాగే సమాజంలో అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల నుండి, వారిని అసభ్యంగా చూసే అబ్బాయిల నుండి ఇన్ స్పైర్ చేసుకొని దర్శకుడు రాహుల్ రిజి నయ్యర్ రాసుకున్నాడు. దర్శకుడు పాటలు, ఫైట్లు, భారీ సెట్లు అంటూ ఏ హంగు ఆర్భాటం లేకుండా తను చెప్పాలనుకున్న దాన్ని సూటిగా చెప్పేశాడు.
సోషల్ మీడియాలో అమ్మాయిల కోసం నిత్యం నెటిజన్లు వెతుకుతూనే ఉంటారు. అమ్మాయిల నెంబర్ దొరికితే చాలు ఇక వారిని ఇబ్బంది పెడతారు. అలాంటి వాటిని చాలా సహజసిద్ధంగా చూపించాడు దర్శకుడు. కథని గ్రిప్పింగ్ గా చూపిస్తూ సాగే సీన్లు ఆకట్టుకుంటాయి. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలలో వచ్చే ట్విస్ట్ లు ఏవీ లేకపోయినా కథనాన్ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా మేకర్స్ చాలా పకడ్బందీగా తీశారు. భిన్నమైన కథలని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చేస్తుంది. అయితే కథ మొత్తం రాధిక చుట్టూనే తిరగడం.. నాలుగైదు లొకేషన్స్ లో కథ సాగడంతో అక్కడ కాస్త బోరింగ్ అనిపించినా.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే మూవీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది.
భారీ తారాగాణం లేకపోవడం.. తెలుగు ఆడియన్స్ కి తెలిసినవాళ్ళు లేకపోవడం మైనస్. కానీ ఫ్రెష్ కథని చూడాలనుకునేవారు ఈ సినిమా ట్రై చేయొచ్చు. అడల్ట్ సీన్లు ఏమీ లేవు.. సినిమాని ఫ్యామిలీతో కలిసి చూసేలా దర్శకుడు జాగ్రత్తపడ్డాడు. రాకేశ్ ధరన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సిద్ధార్థ్ ప్రదీప్ సంగీతం నేపథ్యం ఆకట్టుకుంది. క్రిష్టి సెబాష్టియన్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి.
నటీనటుల పనితీరు:
రాధిక పాత్రలో రజీషా విజయన్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. విజయ్ బాబు, శ్రీనివాసన్, మణికందన్ తమ పాత్రలకి న్యాయం చేశారు. మిగిలిన వారు పాత్రల పరిధి మేరకు నటించారు.
ఫైనల్ గా..
ఆడవాళ్ళు తప్పకుండా చూడాల్సిన ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయొచ్చు.
రేటింగ్: 2.75/5
✍️. దాసరి మల్లేశ్