ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దాదాపు 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన సినిమా ‘దేవర’. యువసుధ ఆర్ట్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకాలపై నందమూరి కళ్యాణ్‌రామ్, మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కొసరాజు ఈ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఇందులో విలన్‌గా నటిస్తున్నారు. ఇలా.. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తూ వచ్చిన చిత్ర యూనిట్ ఫైనల్‌గా అక్టోబర్ 10న సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. గత ఏడాది ‘జైలర్’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సూపర్‌స్టార్ రజినీకాంత్ తన నెక్స్‌ట్ సినిమా ‘లాల్ సలామ్’ ఓ కీలక పాత్ర పోషించారు. రజినీ కుమార్తె ఐశ్వర్యా రజినీకాంత్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయినా టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో రజినీ చేస్తున్న ‘వేట్టయాన్’ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా వంటి హేమాహేమీలు నటిస్తున్నారు. ఈ భారీ చిత్రం కూడా అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ‘దేవర’, ‘వేట్టయాన్’ రెండూ పాన్ ఇండియా సినిమాలే కావడంతో పలు భాషల్లో ఒకే రోజు విడుదల కాబోతున్నాయి.
‘ఆర్‌ఆర్‌ఆర్’లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూసిన ప్రేక్షకులు, అభిమానులు ‘దేవర’ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో, అతని పెర్‌ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అనే విషయాల్లో క్యూరియాసిటీతో ఉన్నారు. రెండు భాగాలుగా రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఇక ‘జైలర్’ చిత్రంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘వేట్టయాన్’తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. దేవర, వేట్టయాన్.. ఈ రెండు సినిమాలకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించడం విశేషంగా చెప్పుకోవాలి. ఒకేరోజు తలపడనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్‌స్టార్ రజినీకాంత్‌లలో విజయం ఎవరిని వరిస్తుంది అనే విషయం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.