తాను పట్టిందల్లా బంగారమే అన్నంతగా ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ (నందమూరి బాలకృష్ణ) టైం నడుస్తుంది. సినిమా అయినా, రాజకీయమైనా తన విజయపరంపరను కొనసాగిస్తూ.. తనకి తానే సాటి అనిపించుకుంటున్నారు బాలయ్య. అందుకే ప్రస్తుతం తెలుగునాట ఆయన పేరు మారుమోగిపోతోంది.
60 ఏళ్ల వయసులోనూ ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకొని.. యంగ్ హీరోలకు సైతం సవాల్ విసురుతున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 109వ (NBK 109) సినిమా చేస్తున్న బాలయ్య.. ఆ సినిమాతో మరో హిట్ ని ఖాతాలో వేసుకొని, వరుసగా నాలుగో విజయం సాధించడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. అయితే సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ బాలయ్య దూకుడు ఇలాగే ఉన్నాడు.
హిందూపురం (హిందూపూర్) నియోజకవర్గం నుంచి బాలకృష్ణ వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో హిందూపురం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన నటసింహం.. 2019లో టీడీపీకి ఎదురుగాలి వీచినా వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి హిందూపురంలో గెలుపు జెండా ఎగురేశారు. పైగా ప్రతి ఎన్నికకు తన మెజారిటీని పెంచుకుంటూ రావడం విశేషం. 2014లో 16 వేల ఓట్ల తేడాతో విజయం సాధించిన బాలయ్య.. 2019లో 18 వేల మెజారిటీతో గెలుపొందారు. ఇక ఇప్పుడు ఈ 2024 ఎన్నికల్లో ఏకంగా 32 వేల మెజారిటీతో బాలకృష్ణ విజయబావుటా ఎగరేశారు.
మొత్తానికి అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ బాలయ్య హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోవడం పట్ల నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.