హిందీ సీరియల్స్ రీమేక్ అవుతున్నాయి. కానీ ఒకప్పుడు హిందీ సీరియల్స్ డబ్బింగ్ అయ్యి ఆకట్టుకున్నాయి. చిన్నారి పెళ్లికూతురు మొదలుకుని అనేక సీరియల్స్ నారీ మణుల్ని అలరించాయి. అటువంటి ధారావాహికల్లో ఒకటి ఈతరం ఇల్లాలు. హిందీ దియా ఔర్ బాతి హమ్ సీరియల్ డబ్బింగ్ వర్షన్. ‘నీ ఊహలే నా ఊపిరై ప్రియా నా ఎద అంకితం చేయనా ప్రియుడా ..పరదాలు తొలగి పసి చిలుక చేరే నిను ప్రియా నీ దాన్ని.. ఓ ప్రియా నీ దాన్ని’ సాంగ్ ఎంత ఫేమస్సో, ఈ సీరియల్ హీరో, హీరోయిన్లు కూడా అంతే ఫేమస్. ఐపీఎస్ కావాలనుకున్న భార్య కలలను నిజం చేసే ఓ మనసున్న భర్త కదే ఈ సీరియల్. ఇందులో సూర్య, సంధ్యారాణిగా నటించారు.. అనాస్ రషీద్, దీపికా సింగ్.
ఈ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది పాపులర్ టీవీ యాక్ట్రెస్ దీపికా సింగ్. ఈ సీరియల్ మధ్యలోనే పెళ్లి చేసుకుంది.. అడపా దడపా సీరియల్స్ చేసింది. 2019లో సీరియల్స్ చేసి ఐదేళ్లు గ్యాప్ తీసుకున్న ఈ నటి ప్రస్తుతం మంగళ లక్ష్మి అనే ధారావాహికలో నటిస్తుంది. తాజాగా ఆమె షూటింగ్‌లో గాయపడింది. అందిన సమాచారం ప్రకారం ముంబయిలోని గోరేగావ్‌లోని ఫిల్మ్‌సిటీలో ఈ సీరియల్ షూటింగ్ జరుగుతుంది. ఈ విధంగానే అనుకోకుండా సెట్‌లో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఆమె వెన్నుముక పైభాగంలో గాయమైనట్లు సమాచారం. ఓ డ్రీమ్ చిత్రీకరిస్తున్నప్పుడు గాలి బలంగా రావడంతో వెనుక అమర్చిన ఫ్లైవుడ్ బోర్డు నటిపై పడింది. దీంతో ఆమె ఒక్కసారిగా అరుస్తూ కిందపడిపోయింది. దీపికా కేకలు విన్న టీమ్.. ఆ బోర్డులను తొలగించింది.
వెన్నుముక పై భాగంలో పడడంతో బలంగా దెబ్బతగిలింది. అయితే అంత నొప్పిలో కూడా ఆమె షూటింగ్ పూర్తి చేయడానికి ప్రయత్నించిందట. కీలక సన్నివేశం నటిస్తానని చెప్పిందట. వాపు రావడంతో ఐస్ ప్యాక్‌లను కూడా ఉపయోగించారు. కానీ నొప్పి తగ్గలేదు. విపరీతమైన నొప్పి రావడంతో షూటింగ్ నిలిపివేశారు. వెన్నుకు తీవ్ర గాయం కావడంతో ఆమెకు కొన్నివారాలు విశ్రాంతి వైద్యులు సూచించినట్లు సమాచారం. కాగా, ఆమె గతంలో ఇదే షూటింగ్ సమయంలో కూడా ప్రమాదానికి గురైంది. అప్పుడు కంటికి గాయం అయినట్లు సమాచారం. దియా ఔర్ బాతీ హమ్ సీరియల్ ద్వారా నటిగా కెరీర్ ప్రారంభించిన దీపిక.. అదే సీరియల్ డైరెక్టర్ రోహిత్ గోయల్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక కొడుకు ఉన్నాడు.