ఇటీవల సైబర్ మోసాలు బాగా పెరిగిపోయాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. తాజాగా ప్రముఖ నటి అనన్య నాగళ్ల (Ananya Nagalla) సైబర్ మోసం నుంచి తృటిలో తప్పించుకుంది.
‘మల్లేశం’, ‘వకీల్ సాబ్’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనన్య.. సైబర్ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని తెలుపుతూ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో ఇటీవల తనకు ఎదురైన ఓ అనుభవాన్ని పంచుకుంది. తన ఆధార్ కార్డు ప్రూఫ్ తో ఎవరో సిమ్ కార్డు తీసుకొని, మోసాలకు పాల్పడుతున్నారు.. దానితో తనకేం సంబంధం లేదని రుజువు చేయడం కోసం ముంబై పోలీసుల నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి అంటూ అనన్యకు ఒక ఫోన్ వచ్చిందట. మొదట అది నిజమని నమ్మిన అనన్య.. తాను హైదరాబాద్ లో ఉన్నానని చెప్పడంతో.. వీడియో కాల్ ద్వారా కంప్లయింట్ ఇచ్చి, క్లియరెన్స్ తీసుకోమని చెప్పారట. అలా వీడియో కాల్ లో మాట్లాడుతూ.. నీ ఐడీతో చాలా బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని, అక్రమ లావాదేవీలు జరిగిపోయాయని, ఆ ఫేక్ అకౌంట్స్ తో నీకు సంబంధం లేదని, ప్రస్తుతం వాడుతున్న అకౌంట్ నుంచి కొంత డబ్బు ట్రాన్స్ ఫర్ చేయాలని చెప్పారట. దాంతో అనుమానం వచ్చిన అనన్య.. వారితో వాదనకు దిగి, లోకల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పిందంట. దాంతో వాళ్ళు వెంటనే కాల్ కట్ చేశారట. ఈ మొత్తం ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న అనన్య.. ఇలాంటి మోసాల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించింది.