టాలీవుడ్ సీనియర్ స్టార్స్ లో టాప్-2 హీరోలు అంటే మెగాస్టార్ చిరంజీవి (చిరంజీవి), నందమూరి బాలకృష్ణ (బాలకృష్ణ) పేర్లు వినిపిస్తున్నాయి. అప్పట్లో వీరి బాక్సాఫీస్ వార్ కి ఫుల్ క్రేజ్ ఉండేది. తరువాతి తరం స్టార్స్ వచ్చినా కూడా.. ఇప్పటికీ ఈ స్టార్స్ బాక్సాఫీస్ దగ్గర నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతూనే ఉంటారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే చిరంజీవి వారసుడిగా ఆయన కుమారుడు రామ్ చరణ్ (రామ్ చరణ్) సినీ రంగ ప్రవేశం చేసి.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. కానీ బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ (మోక్షజ్ఞ) మాత్రం లేట్ గా లేటెస్ట్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.
ప్రస్తుతం మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అతని రీసెంట్ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. స్టార్ మెటీరియల్ అంటూ నందమూరి అభిమానులు సంబరపడుతున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలతో పాటు ఒత్తిడి కూడా భారీగానే ఉంటుంది అనడంలో సందేహం లేదు. అదే సమయంలో రామ్ చరణ్ వంటి స్టార్స్ తో పోలికలు కూడా వస్తాయి.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘చిరుత’ సినిమాతో హీరోగా పరిచయమైన రామ్.. మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక రెండో సినిమాగా రాజమౌళి డైరెక్షన్ లో చేసిన ‘మగధీర’ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిపోయింది, చరణ్ ని తిరుగులేని స్టార్ ని చేసింది. ఇప్పుడు మోక్షజ్ఞకు కూడా అలాంటి ఎంట్రీ పడాలి. మోక్షజ్ఞ మొదటి మూవీ ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో చేయనున్నాడని తెలుస్తోంది. రెండో సినిమా కోసం బోయపాటి శ్రీను లేదా త్రివిక్రమ్ శ్రీనివాస్ రంగంలోకి దిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధిస్తే, మోక్షజ్ఞకు సాలిడ్ ఎంట్రీ కుదిరినట్టే. ఇప్పటికే తన రీసెంట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక యాక్టింగ్ తోనూ అదరగొడితే తిరుగులేని స్టార్ అవుతాడు అనడంలో డౌట్ లేదు. అదే జరిగితే, అప్పట్లో చిరంజీవి-బాలకృష్ణ బాక్సాఫీస్ వార్ ని తలపించేలా.. భవిష్యత్ లో రామ్ చరణ్-మోక్షజ్ఞ బాక్సాఫీస్ వార్ చూడవచ్చు.