ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రణీత్ హనుమంతు (ప్రణీత్ హనుమంతు) పేరు తెగ వినిపిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ అతనిపై మండిపడుతున్నారు. మొన్నటివరకు కొంతమందికి తెలిసిన అతని పేరు.. ఇప్పుడు ఎంతో మందికి తెలిసింది. చాలా మంది అతని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రణీత్ హనుమంతు ఒక యూట్యూబర్. ఫన్ పేరుతో ఇతరులను ఎలాపడితే అలా ట్రోల్ చేస్తూ, రోస్ట్ వీడియోలు చేయడమే ఇతని పని. ఈ ట్రోల్స్ ఒక్కోసారి హద్దుమీరి ఉంటాయి. గతంలో అనేక నెటిజన్లు ఇతని తీరుని తప్పుబట్టారు. ఇక ఇటీవల ఒక చిన్నారితో ఆమె తండ్రి ఉన్న వీడియోపై ప్రణీత్ వల్గర్ కామెంట్స్ చేశాడు. మాటల్లో చెప్పడానికి కూడా వీల్లేని, అసహ్యమైన కామెంట్స్ అవి. తండ్రీకూతుళ్ల వీడియోపై, అందునా ఒక చిన్నారి ఉన్న వీడియోపై అలాంటి కామెంట్స్ చేయడంతో నెటిజన్లు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ప్రణీత్ హనుమంతుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకపై హీరో సాయి ధరమ్ తేజ్ ఘాటుగా స్పందించడంతో.. ఈ విషయం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా చేరింది. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీ ఇలా అందరూ స్పందించి.. కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే కేసు కూడా నమోదైంది. అయినా ప్రణీత్ కి తగిన శిక్ష పడుతుందా లేదా? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రణీత్ సామాన్యుడు కాదు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ బాగానే ఉంది. అతని తండ్రి హెచ్. అరుణ్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అధికారి. ఆయన ఏపీలో సివిల్ సప్లయిస్ కమిషనర్ గా విధులు నిర్వహించారు. ఒక సీనియర్ ఐఏఎస్ గా ఆయనకు ముఖ్యమంత్రి మొదలుకొని.. మంత్రులు, ఉన్నత అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. అందుకే ప్రణీత్ పై చర్యలు ఎంతవరకు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయం ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. ఎందరో సెలబ్రిటీలు ఘాటుగా స్పందించారు. ప్రభుత్వాలు కూడా ఈ నిర్ణయం చాలా సీరియస్ గా తీసుకున్నాయి. కాబట్టి ప్రణీత్ ని అంత తేలికగా విడిచిపెట్టే అవకాశం ఉండదని చెప్పవచ్చు.
ప్రణీత్ కి సంబంధించి ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇతని సోదరుడు అజయ్ హనుమంత్ కూడా యూట్యూబరే. ‘ఏ జూడ్’ అనే ఫ్యాషన్ ఛానల్ ద్వారా అతను ఎంతో తెచ్చుకున్నాడు. ఒక ఐఏఎస్ కొడుకు యూట్యూబర్ అవ్వడం తప్పుకాదు. యూట్యూబ్ ద్వారా వినోదాన్ని పంచో, విజ్ఞానాన్ని అందించినా.. డబ్బు సంపాదించడం కూడా తప్పుకాదు. కానీ స్వేచ్ఛ పేరుతో వెకిలి వేషాలు వేయకూడదు. ముఖ్యంగా కామెడీ పేరుతో చిన్నారులపై చిల్లర కామెంట్స్ చేయకూడదు. కానీ ప్రణీత్ హనుమంతు అదే పని చేసి.. ఇప్పుడు ఇంతమంది ద్వేషాన్ని చూస్తున్నాడు.
ఈ ప్రణీత్ అనే వ్యక్తికి సినీ పరిశ్రమతో కూడా మంచి అనుబంధం ఉంది. ‘మై డియర్ దొంగ’, ‘హరోం హర’ వంటి సినిమాల్లో నటించాడు. ‘కీడ కోలా’, ‘హాయ్ నాన్న’, ‘భజే వాయు వేగం’ వంటి సినిమాలకు ప్రమోషనల్ వీడియోలు చేశాడు. అయితే ప్రణీత్ తమ సినిమాల్లో నటించాడని, అతనితో పరిచయముందని చెప్పుకోవడానికి కూడా సినిమా వాళ్ళు చిరాకు పడుతున్నారు. తాజాగా ప్రణీత్ పై హీరో సుధీర్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రణీత్ ఇలాంటి వ్యక్తి అని తెలియదని, అతడు ‘హరోం హర’ సినిమాలో భాగమైనందుకు అసహ్యంగా ఉందని అన్నాడు.
ప్రణీత్ ఇప్పటికే ఈ సంఘటనపై క్షమాపణలు చెప్పాడు. అయినా ఎవరికీ అతని మీద కోపం తగ్గడంలేదు. ఎందుకంటే సారీ చెప్తే కూల్ అయ్యే అంత చిన్న తప్పు కాదు అతను చేసింది. చిన్నారిపై దారుణమైన కామెంట్స్ చేశాడు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో స్వేచ్ఛ పేరుతో ఇలాంటి కామెంట్స్ చేస్తే వారిని కఠినంగా శిక్షించాలని, అప్పుడే భవిష్యత్ లో ప్రణీత్ లాంటి వారు రారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.