వివాదస్పద యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు (Praneeth Hanumanthu) అరెస్ట్ అయ్యాడు. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు కోర్టులో ప్రణీత్ ను హాజరుపరిచి.. పీటీ వారెంట్ పై హైదరాబాద్ కి తీసుకురానున్నారు. ప్రణీత్ తో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రణీత్ హనుమంతు (phanumantu) ఒక యూట్యూబర్. ఫన్ పేరుతో ఇతరులను ఎలాపడితే అలా ట్రోల్ చేస్తూ, రోస్ట్ వీడియోలు చేయడమే ఇతని పని. ఈ ట్రోల్స్ ఒక్కోసారి హద్దుమీరి ఉంటాయి. ముఖ్యంగా మహిళలపై దారుణంగా వ్యాఖ్యలు చేశారు. గతంలో అనేక నెటిజన్లు ఇతని తీరుని తప్పుబట్టారు. ఇక ఇటీవల ఒక చిన్నారితో ఆమె తండ్రి ఉన్న వీడియోపై.. తన ఫ్రెండ్స్ తో కలిసి యూట్యూబ్ లైవ్ లో ప్రణీత్ వల్గర్ కామెంట్స్ చేశాడు. మాటల్లో చెప్పడానికి కూడా వీల్లేని, అసహ్యమైన కామెంట్స్ అవి.
తండ్రీకూతుళ్ల వీడియోపై, అందునా ఒక చిన్నారి ఉన్న వీడియోపై అలాంటి కామెంట్స్ చేయడంతో నెటిజన్లు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ప్రణీత్ హనుమంతుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకపై హీరో సాయి ధరమ్ తేజ్ ఘాటుగా స్పందించడంతో.. ఈ విషయం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా చేరింది. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఇలా అందరూ స్పందించి.. కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసు శాఖ కూడా వెంటనే స్పందించి కేసు నమోదు చేసింది. ఈ కారణంగానే అతను బెంగుళూరులో ఉన్నాడనే సమాచారంతో అక్కడికెళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రణీత్ హనుమంతు అరెస్ట్ తో అందరి నుంచి హర్షం వ్యక్తమవుతోంది.